Los Angeles Olympics: లాస్ ఏంజెల్స్ (Los Angeles Olympics)లో జరగనున్న 2028 ఒలింపిక్ క్రీడల పూర్తి షెడ్యూల్‌ను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ క్రీడలు జులై 14, 2028న అధికారికంగా ప్రారంభమై.. జులై 30, 2028 వరకు కొనసాగుతాయి. ఈ ఒలింపిక్స్ క్రీడా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్‌గా నిలవనుంది. ఎందుకంటే ఇందులో రికార్డు స్థాయిలో మొత్తం 36 వేర్వేరు క్రీడలు ఆడబడతాయి.
ఈ మెగా ఈవెంట్ కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్, ఓక్లహోమా సిటీలలో విస్తరించి ఉన్న మొత్తం 49 వేదికలను, 18 జోన్‌లను ఖరారు చేశారు. ఈ విస్తృతమైన వేదికల ఎంపిక, అభిమానులు సులభంగా తమకు నచ్చిన క్రీడలను వీక్షించేందుకు వీలు కల్పిస్తుంది.
క్రికెట్‌కు శతాబ్దపు పునరాగమనం
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ అత్యంత ఉత్సాహభరితమైన అంశాలలో ఒకటి. క్రికెట్ క్రీడకు ఒలింపిక్స్‌లో వంద సంవత్సరాల తర్వాత పునరాగమనం లభించడం. క్రికెట్ మ్యాచ్‌ల ఉత్సాహం అధికారిక టోర్నమెంట్ ప్రారంభానికి ముందే మొదలవుతుంది. క్రికెట్ పోటీలు జులై 12న ప్రారంభమై, మెగా ఫైనల్ జులై 29న జరుగుతుంది. క్రికెట్ అభిమానులకు ఇది ఒక చారిత్రక ఘట్టం కానుంది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, స్క్వాష్ వంటి క్రీడలు కూడా ఒలింపిక్స్‌లోకి తిరిగి వస్తున్నాయి. ఈ పునరాగమనం సరికొత్త ఈవెంట్‌ల ప్రవేశంతో కలిసి ఈ ఒలింపిక్స్‌లో అనేక చారిత్రక ఘట్టాలు నమోదయ్యేందుకు మార్గం సుగమం చేస్తుంది.
Also Read: Attacks : అమరావతి జిల్లాలో దారుణం..పెళ్లికొడుకు పై ఎటాక్
మహిళా ప్రాతినిధ్యంలో రికార్డులు
ఈ ఒలింపిక్స్‌కు సంబంధించి మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. ఒలింపిక్ క్రీడల చరిత్రలో తొలిసారిగా పురుషుల కంటే మహిళా క్రీడాకారుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. క్రీడా ప్రపంచంలో లింగ సమానత్వాన్ని సాధించే దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగు.
టికెట్ రిజిస్ట్రేషన్ వివరాలు
LA28 CEO రెనాల్డ్ హూవర్ మాట్లాడుతూ.. “క్రీడాభిమానులు తమ టిక్కెట్ రిజిస్ట్రేషన్‌ను జనవరి 2026లో ప్రారంభించుకోవచ్చు. ఇది ఏయే పోటీలను చూడాలనుకుంటున్నారో, ఏ క్రీడలు తమ నగరంలో జరుగుతాయో? ఏ చారిత్రక క్షణాలను మిస్ కాకూడదో నిర్ణయించుకోవడానికి సరైన సమయం” అని పేర్కొన్నారు. మొత్తంమీద 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కేవలం క్రీడా పోటీలు మాత్రమే కాదు. అనేక రికార్డులు, చారిత్రక పునరాగమనాలు, లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ క్రీడా ప్రపంచాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఒక అంతర్జాతీయ వేడుక.
