Asia Cup 2023: పాక్ లోనే ఆసియా కప్.. భారత్ మ్యాచ్ లకు మరో వేదిక

పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియాకప్ విషయంలో బీసీసీఐ తగ్గేదే లేదంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ కు వెళ్ళేది లేదని ఇప్పటికే తెగెసి చెప్పేసింది.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 11:10 AM IST

పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ (Asia Cup) విషయంలో బీసీసీఐ తగ్గేదే లేదంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ కు వెళ్ళేది లేదని ఇప్పటికే తెగెసి చెప్పేసింది. దీనిపై పాక్ బోర్డు భారత్ ను బెదిరించే ప్రయత్నం చేసినా బీసీసీఐ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో టోర్నీ పాక్ లో ఉంటుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ లోనే టోర్నీ నిర్వహించనుండగా.. భారత్ మ్యాచ్ లు మాత్రం మరో వేదికలో ఏర్పాటు చేసేలా రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లకు వేదికగా శ్రీలంక, యూఏఈ, ఒమన్ , బంగ్లాదేశ్ లలో ఒకదానిని ఎంపిక చేయనున్నారు. మిగిలిన దేశాలు ఆడే మ్యాచ్ లు అన్నింటికీ పాకిస్తానే ఆతిథ్యమివ్వనుంది. ఒకవేళ భారత్ , పాక్ జట్లు ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కూడా తటస్థ వేదికలో నిర్వహించేలా అంగీకారానికి వచ్చినట్టు సమాచారం.

నిజానికి పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ నుంచి వైదొలగాలని భారత్ భావించింది. భద్రతా కారణాల రీత్యా, ఇంకా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో పాక్ కు వెళ్ళేందుకు నిరాకరించింది. భారత్ తప్పుకుంటే వన్డే ప్రపంచకప్ నుంచి తాము కూడా వైదొలుగుతామంటూ పాక్ క్రికెట్ బోర్డు బెదిరించింది. అయినప్పటకీ బీసీసీఐ పాక్ కు వెళ్ళేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ జోక్యం చేసుకుని రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించింది. ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్‌ ఉండడంతో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు ఆసియా కప్‌లో (Asia Cup) మొత్తం ఆరు దేశాలు పాల్గొననుండగా.. భారత్‌, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌లు ఒక గ్రూప్‌లో ఉండగా.. మరొక గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. మొత్తం 13 రోజుల పాటు జరగనున్న టోర్నీలో గ్రూప్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-4లో టాప్‌ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి.

Also Read:  Hindenburg: మరో దెబ్బ కొట్టిన హిండెన్ బర్గ్.. ఈ సారి ట్విట్టర్ మాజీ సీఈవో వంతు..!