1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

టెస్ట్ సిరీస్ ముగిసింది...ఇక పొట్టి ఫార్మేట్‌లో తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 08:50 AM IST

టెస్ట్ సిరీస్ ముగిసింది…ఇక పొట్టి ఫార్మేట్‌లో తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి. మూడు టీ ట్వంటీల సిరీస్‌లో భాగంగా గురువారం సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. షార్ట్ ఫార్మేట్ కావడంతో ఎవరినీ ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి. అయితే బలాబలాల పరంగా ఇంగ్లాండ్‌కే కాస్త ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తోంది. భారత జట్టులోని పలువురు సీనియర్లకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చారు. కరోనా నుంచి కోలుకున్న రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేని హిట్ మ్యాన్ ఇంగ్లాండ్‌పై సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌లో కూడా రోహిత్ పెద్దగా రాణించలేదు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ఫామ్‌లోకి రావడం రోహిత్‌కే కాదు జట్టుకు కూడా ముఖ్యమే. అలాగే మెగా టోర్నీకి జట్టు కూర్పుపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో చోటు ఆశిస్తున్న పలువురు యువ ఆటగాళ్ళు సత్తా చాటేందుకు ఇంగ్లాండ్‌తో సిరీస్ అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఐర్లాండ్ టూర్‌లో సత్తా చాటినప్పటకీ.. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై రాణిస్తే సెలక్టర్లను మరింత ఆకట్టుకోవచ్చు. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ , దీపక్ హుడాలపై అంచనాలున్నాయి. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా పోటీ ఎక్కువైన నేపథ్యంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. అటు బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు యువ పేసర్లు హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్,
అర్షదీప్‌సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. స్పిన్ విభాగంలో చాహల్, రవి బిష్ణోయ్ కీలకం కానుండగా.. ఆల్‌రౌండర్ కోటాలో హార్థిక్ పాండ్యా తన ఫామ్ ఎంతవరకూ కొనసాగిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు భారత్ 15 టీ ట్వంటీలు ఆడనుంది. ఇంగ్లాండ్‌తో మూడు, విండీస్‌తో ఐదు , అనంతరం ఆసియా కప్‌లో ఐదు టీట్వంటీలు, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీ తుది జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్‌మెంట్ తర్జన భర్జన పడుతున్న వేళ ఇంగ్లాండ్‌ , ఆ తర్వాత జరిగే సిరీస్‌లే ప్రామాణికం కానున్నాయి.

ఇదిలా ఉంటే సొంతగడ్డపై ఇంగ్లాండ్ జట్టు బలంగా కనిపిస్తోంది. మోర్గాన్ రిటైర్మెంట్‌తో జట్టు పగ్గాలు అందుకున్న బట్లర్ కెప్టెన్సీకి ఈ సిరీస్ పరీక్షగానే చెప్పాలి. శామ్ కురాన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, జాసన్ రాయ్ వంటి టీ ట్వంటీ ప్లేయర్స్‌ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బెన్ స్టోక్స్, బెయిర్ స్టో వంటి సీనియర్లు లేకున్నా షార్ట్ ఫార్మేట్‌లో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్నవారే. వచ్చే ప్రపంచకప్‌కు తుది జట్టు కూర్పు కోసం ఇంగ్లాండ్ కూడా కసరత్తు చేస్తున్న వేళ భారత్‌తో సిరీస్‌ ఆ జట్టుకు కూడా కీలకం కానుంది.