IPL Auction 2022 : వేలానికి వేళాయె…

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్.

  • Written By:
  • Publish Date - February 11, 2022 / 02:58 PM IST

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్. 14 ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ లీగ్ ఇటు బీసీసీఐకి, అటు ఆటగాళ్ళకే కాదు… ఫ్రాంచైజీలకూ, స్పాన్సర్లకూ కాసుల వర్షం కురిపించింది. ఈ లీగ్ లో ఆడితే కేవలం డబ్బులే కాదు తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకోవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లు ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఐపీఎల్ వేలం రిజిస్ట్రేషన్ కు వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణ. దాదాపు వెయ్యికి పైగా ఆటగాళ్ళు తమ పేర్లు నమోదు చేసుకోగా… అర్హత, ఇత నిబంధనలకు లోబడి బీసీసీఐ 590 మంది ఆటగాళ్ళకు ఆ జాబితాను కుదించింది. వీరంతా శని, ఆదివారాలు బెంగళూరు వేదికగా జరగబోయే మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రెండు కొత్త జట్ల ఎంట్రీతో వచ్చే సీజన్ 10 టీమ్స్ తో భారీస్థాయిలో జరగనుండగా.. వేలంలో ఆటగాళ్ళపై కాసుల వర్షం కురవబోతోంది. వేలం బరిలో 590 మంది నిలిచినప్పటకీ… అందుబాటులో ఉన్న ఖాళీలు 217 మాత్రమే. దీంతో ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడవుతాడో… స్టార్ ప్లేయర్స్ పై కోట్లు వెచ్చిస్తాయా… లేక యువక్రికెటర్లు జాక్ పాట్ కొడతారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. వేలానికి సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు కలిపి 900 కోట్ల బడ్జెట్ ను మాత్రమే ఖర్ఛు చేయాల్సి ఉంటుంది. ఇప్పచికే 10 ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్ళను రిటైన్ చేసుకునేందుకు రూ, 338.5 కోట్లు వెచ్చించాయి. ప్రస్తుతం 561.5 కోట్ల రూపాయలతో వేలం బరిలో నిలిచాయి. అన్ని ఫ్రాంచైజీల్లోనూ పంజాబ్ కింగ్స్ దగ్గరే ఎక్కువ పర్స్ మనీ ఉంది. పంజాబ్ కింగ్స్ 72 కోట్ల రూపాయలతో వేలానికి సిద్ధమవగా… సన్ రైజర్స్ హైదరాబాద్ 68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ 62 కోట్లతో వేలం బరిలో నిలిచాయి. మిగిలిన జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర 59 కోట్లు , బెంగళూరు దగ్గర 57 కోట్లు, గుజరాత్ టైటాన్స్ దగ్గర 52 కోట్లు, ముంబై, కోల్ కతా , చెన్నై జట్ల దగ్గర 48 కోట్ల చొప్పున ఉండగా…ఢిల్లీ క్యాపిటల్స్ 47.5 కోట్లతో వేలం బరిలో నిలిచింది. దాదాపు ప్రతీ జట్టులోనూ ప్రస్తుతం 22 ఖాళీలు ఉండగా… వీరిలో ఏడుగురు వరకూ విదేశీ ఆటగాళ్ళను తీసుకోవచ్చు. కాగా తొలిరోజు 161 మంది వేలంలో ఉండబోతున్నారు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో 10 మంది ఆటగాళ్ళ జాబితాను ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. వీరితోనే వేలం ప్రారంభం కాబోతోంది. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమ్మిన్స్ , క్వింటన్ డికాక్ , ట్రెంట్ బౌల్ట్ , శిఖర్ ధావన్ , డుప్లెసిస్ , శ్రేయాస్ అయ్యర్, కగిసో రబాడ, డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నారు.