Virat Kohli: 500వ మ్యాచ్‌లో 100.. కోహ్లీ రికార్డుల మోత

కరేబియన్ గడ్డపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్ట్ తరహాలోనే రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 11:01 PM IST

Virat Kohli: కరేబియన్ గడ్డపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్ట్ తరహాలోనే రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలిరోజు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ అదరగొడితే… రెండోరోజు విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. చాలా రోజుల తర్వాత పూర్తి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.

ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ భారీస్కోర్ దిశగా సాగుతోంది. 87 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండోరోజు బ్యాటింగ్ కొనసాగించిన విరాట్ దూకుడు తొలి సెషన్‌లో కొనసాగింది. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచిన విరాట్ కెరీర్‌లో 76వ శతకం సాధించాడు. అలాగే టెస్టుల్లో 29వ సెంచరీని అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఎవ్వరూ ఈ ఘనత సాధించలేదు.

సచిన్ , ద్రావిడ్, ధోనీ తర్వాత 500 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడు కోహ్లీనే అలాగే విదేశీ గడ్డపై 55 నెలల తర్వాత శతకం సాధించాడు. 2018 తర్వాత విదేశాల్లో విరాట్ సెంచరీ చేయలేదు. 180 బంతుల్లో సెంచరీ చేసిన కోహ్లీ 121 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రనౌటయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే నాలుగో స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో విండీస్ దిగ్గజం బ్రయాన్ లారాను అధిగమించాడు. నాలుగో స్థానంలో కోహ్లీ 25 సెంచరీలు చేయగా… సచిన్ 44 శతకాలతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

కల్లిస్ 35, జయవర్థనే 30 శతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ. ఇక వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు. విండీస్‌పై సునీల్ గవాస్కర్ 13 సెంచరీలు చేస్తే… కోహ్లీ 12 సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌గా విండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితాలో ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ తాజాగా ఆసీస్ ప్లేయర్ మైకేల్ క్లార్క్‌ను అధిగమించాడు. మరోవైపు టెస్టుల్లో అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ… విలియమ్సన్, క్లార్క్ , హషీమ్ ఆమ్లాలను దాటేశాడు. అలాగే క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌తో సమంగా నిలిచాడు.