Site icon HashtagU Telugu

TSRTC: నేటి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ

TSRTC bus pass price hike

TSRTC bus pass price hike

TSRTC: మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు.

“ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళ నుంచి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాప్ట్ వేర్ ను సంస్థ అప్ డేట్ చేసింది.  ఆ సాప్ట్ వేర్ ను టిమ్ మెషిన్లలో ఇన్ స్టాల్ చేయడం జరుగుతోంది. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుంది. మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి.. విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు సూచించారు.

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా సజ్జనర్ అభినందించారు.