Nagababu: రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు అని వైసీపీ నాయకులు ఓట్లు అడుగుతారు : నాగబాబు

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 10:25 PM IST

Nagababu: వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జనసేన – టీడీపి కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రానున్నదని, ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఎసీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిని పట్టి పీడిస్తున్నవి ప్రధానంగా దోమలు, వైసీపీ నాయకులు అని సిగ్గు, యగ్గు వదిలేసి రోడ్ల పై గుండాల్లాగ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు అని ప్రజలను ఓట్లు అడుగుతారని అన్నారు.

జన సైనికులకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం నేర్పారని, మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను ఈ ఐదేళ్ళలో ఏం అభివృద్ధి చేసారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో అనకాపల్లి బెల్లం వాడేవారని దానిని కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీను తిరిగి ప్రారంభించక పోగా అమ్మకానికి పూనుకున్నారని, ఫ్యాక్టరీ పై ఆధారపడిన లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతున్నారని అన్నారు. మీ అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పేరు నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదని, ఇలాంటి మంత్రిని నేను ఎక్కడా చూడలేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉంటూ అనకాపల్లికి ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు చెప్పాలని అన్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలోని ఇంత నీచమైన, నికృష్టమైన, బఫూన్ ప్రభుత్వం లేదని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దొరికిందని, ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం ఎక్కువైపోయిందని ఉమ్మడి విశాఖ జిల్లా లోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుందని అందులో ఇక్కడ మంత్రికి కూడా వాటా ఉందని తెలిసిందని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరన్ హ్యాండ్ తో గంజాయి వ్యాపారాన్ని పెకిలిస్తామని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆక్రమణలు, కబ్జాలు వాడితో సహా జరిమానా వేసి మరీ వసూలు చేస్తామని హెచ్చరించారు.