AP Finances: అవన్నీ జగన్ ప్రభుత్వ ఆర్థిక ఉల్లంఘనలే : యనమల రామకృష్ణుడు విమర్శించారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానివి అన్నీ ఆర్థిక ఉల్లంఘనలేనని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - August 28, 2022 / 09:34 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానివి అన్నీ ఆర్థిక ఉల్లంఘనలేనని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సైతం లెక్కచేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి పాలు చేసేవరకు జగన్ నిద్రపోయేట్లు లేరని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం ఓ వైపు బడ్జెట్ ప్రతిపాదనలు పక్కనపెడుతూ మరోవైపు ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీని ఆర్థిక ఊబిలోకి నెడుతోందన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వ సీఎఫ్ఎంఎస్‌ను బైపాస్‌ చేస్తూ దొడ్డిదారిలో బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. ట్రెజరీ కోడ్‌ ను ఉల్లంఘించి ప్రత్యేక బిల్లుల కింద రూ.48,284.32 కోట్లు తన అనుయాయులకు దోచిపెట్టారని వివరించారు. వేస్ అండ్ మీన్స్ ద్వారా రూ.1.04 లక్షల కోట్ల ప్రత్యేక నిధులు, ఓడీ కింద రూ.31 వేల కోట్లు తీసుకొచ్చి దేనికి ఖర్చుపెట్టారో కూడా లెక్కలు చెప్పలేదన్నారు. మద్యంపై బాండ్లు విడుదల చేసి తెచ్చిన రూ.8,305 కోట్లు, ఏపీ ఎస్డీసీ ద్వారా తెచ్చిన రూ.25 వేల కోట్ల అప్పులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) కి పూర్తి విరుద్ధమని తెలిపారు.
దేశంలోనే అత్యధికంగా చేబదుళ్లు తీసుకున్న ప్రభుత్వం ఇదేనన్నారు. 2019-20 లో 57 రోజులు, 2020-21 లో 103 రోజులు, 2021-22 లో 146 రోజులు ఓడీకి వెళ్లి మొత్తంగా మూడేళ్లలో 306 రోజులు ఓడీకి వెళ్లారని వివరించారు. ఇది ఏడాదికి సరాసరి 102 రోజులని, తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఏడాదికి సరాసరి కేవలం 35 రోజులు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో రూ.1,63,981 కోట్లు అప్పు చేసిందని, అంటే ఏడాదికి రూ.32,800 కోట్లు మాత్రమేనని వివరించారు. కానీ, ఈప్రభుత్వం మూడేళ్లలో రూ.3,67,859 కోట్లు అప్పు చేసి ఏడాదికి సరాసరి రూ.1,11,472 కోట్లు చేసిందన్నారు.

2022-23 ఆర్ధిక సంవత్సరం ఐదు నెలల కాలంలోనే రూ.46,803 కోట్లు అప్పు చేశారని తెలిపారు. మద్యం బాండ్లు పెట్టి మరో రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.2018-19 లో రూ.13,899 కోట్లు ఉన్న రెవెన్యూ లోటు రెండేళ్లలో రూ.35,441 కోట్లకు చేరిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ మొదటి రెండేళ్లు కలిపి రూ.65 వేల కోట్లు, టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల లోటుకు సమానమని పేర్కొన్నారు. ఇంతటి రెనెన్యూ లోటు దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదన్నారు. 2018-19 లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి ద్రవ్యలోటు స్థూల ఆదాయంలో 4.11 శాతమని, వైసీపీ ప్రభుత్వం దాన్ని 9.60 శాతానికి పెంచేసినట్లు తెలిపారు.
జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక సంక్షోభం, వ్యవస్థల విధ్వంసం కారణంగా రాష్ట్రం సరిదిద్దలేని అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, యువత ఉపాధి కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో యువకులు తీవ్ర నిరాశనిస్పృహల్లో ఉన్నారని తెలిపారు.టీడీపీ హయాంలో 4 శాతం ఉన్న నిరుద్యోగం నేడు 12 శాతంకు పెరిగిపోయిందని యనమల వివరించారు.