Site icon HashtagU Telugu

Jagadeeshwar Goud : రాసిపెట్టుకోండి శేరిలింగంపల్లి నాదే – జగదీశ్వర్‌ గౌడ్

Write Down Serilingampalli Nade Jagadishwar Goud

Write Down Serilingampalli Nade Jagadishwar Goud

Jagadeeshwar Goud : ఎన్నికలప్పుడు ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా..లేనివీ, ఉన్నవీ అన్ని చెప్పి.. నా పార్టీని గెలిపించండి, నన్ను గెలిపించండి అంటారే తప్ప నా పార్టీ మేనిఫెస్టో ఇది, నా కమింట్‌మెంట్ ఇది. మీకు నచ్చితేనే ఓటేయండి లేదంటే వదిలేయండి అని చెప్పే లీడర్లున్నారా. ఉన్నా చాలా అరుదు. ఆ అరుదైన వాళ్లలో ఒకరు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ (Jagadeeshwar Goud). ప్రజాసేవపై ఆయనకున్న కమిట్‌మెంట్ ఏంటో ఆయన మాటల్లోనే .. “కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేసీఆర్ పాలనపై విసిగిపోయిన జనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఒకటికి పది సర్వేలు చేయించి గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తోంది. అందులో భాగంగానే శేరిలింగంపల్లి టిక్కెట్‌ నాకు దక్కింది. నేనేంటో మీ అందరికీ తెలుసు. లేనివి ఉన్నట్లు, ఉన్నయి లేనట్లు చెప్పడం నాకు చేతకాదు. జగదీశ్వర్‌ గౌడ్‌ ముక్కుసూటి మనిషని మీకు అందరికీ తెలిసిందే. మీ బిడ్డగా ఒకే మాట చెబుతున్నా… శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిచే అర్హత నాకు లేదు, కాంగ్రెస్‌ టిక్కెట్ నాకు ఇచ్చి ఉండకూడదు అని వన్ పర్సెంట్ అనిపించినా నాకు ఓటెయ్యొద్దు. కానీ ఒ‍కటి గుర్తు పెట్టుకోండి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అత్యవసరం. ఏ ఆశయాల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో.. ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి నియంత పాలన నడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి”.

We’re Now on WhatsApp. Click to Join.

ఇలా జగదీశ్వర్‌ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై శేరిలింగంపల్లిలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునే లీడర్లు మస్తుగా వస్తారు. కానీ నేను పనిచేస్తా అని నమ్మకముంటేనే నాకు ఓటెయ్యండి లేదంటే వదిలేయండనే నాయకులు ఎక్కడ ఉన్నారనే చర్చ మొదలైంది. జగదీశ్వర్‌ గౌడ్‌ కమిట్‌మెంట్‌కు స్థానిక కాంగ్రెస్‌ అదనపు బలంగా మారింది. పంచాయితీలు పక్కనపెట్టి పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. జెరిపేటి జైపాల్, మారబోయిన రఘునాథ్‌ యాదవ్‌లు సంపూర్ణ మద్దతు తెలపడంతో జగదీశ్వర్‌ (Jagadeeshwar Goud)కు వెయ్యి ఏనుగుల బలమొచ్చింది.

మచ్చలేని నాయకుడైన జగదీశ్వర్‌ అన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రఘునాథ్ యాదవ్ చెబుతున్నారు. రఘునాథ్ యాదవ్ పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయడం పట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ (Jagadeeshwar Goud) సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రఘునాథ్‌ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

ఇలా శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులంతా ఒక కుటుంబంలా మారిపోయి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తున్నాడు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు. అన్నదమ్ముల్లా కలిసిపోయి పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల్ని చూసి పాలక పక్షంలో గుబులు మొదలైంది. శేరిలింగంపల్లిలో జగదీశ్వర్‌ గౌడ్‌ (Jagadeeshwar Goud)కు జనాల్లో పెరుగుతున్న మద్దతు చూసి అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన జగదీశ్వర్ గౌడ్ రాజకీయాల్లో కిందిస్థాయి నుంచి ఎదిగారు. కార్పొరేటర్‌గా పనిచేశారు. నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు బాగున్నాయి. బంధువర్గం కూడా అధికంగానే ఉంది. అందుకే కాంగ్రెస్ సర్వేల మీద సర్వేలు చేయించి మరీ చివరకు జగదీశ్వర్ గౌడ్‌కు టిక్కెట్ కేటాయించింది. ఇక్కడ సెటిలర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆంధ్ర, రాయలసీమకు చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారి ఓట్లు తనకేనన్న నమ్మకంతో ఉన్నారు. రాజకీయ సమీకరణాలన్నీ తనకు అనుకూలంగా ఉండటంతో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాననే ధీమాతో ఉన్నారు జగదీశ్వర్‌ గౌడ్.

Also Read:  Jagadeeshwar Goud: శేరిలింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ జోరు, కాంగ్రెస్ కు జై కొడుతున్న జనం!