Wriddhiman Saha:ఆ జర్నలిస్టుపై చర్యలు తీసుకోండి

భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తికి గురైన సాహా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • Written By:
  • Publish Date - February 21, 2022 / 04:59 PM IST

భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తికి గురైన సాహా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో ఇంటర్యూ కోసం ఓ జర్నలిస్ట్ బెదిరింపులకు పాల్పడ్డాడంటూ సాహా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. జర్నలిస్టుతో జరిగిన సంభాషణ వాట్సాప్ మెసేజ్‌ స్క్రీన్ షాట్ ఫోటోలను సాహా తన ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయంపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో సదరు జర్నలిస్టు వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక క్రికెటర్‌కు జర్నలిస్టు నుండి ఎదురైన బెదిరింపులు ఇవేనంటూ సాహా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆ జర్నలిస్ట్ ఎవరో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపించారు.

ఈ వివాదానికి సంబంధించి మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్ , హర్భజన్‌సింగ్, ప్రగ్యాన్ ఓజా వంటి వారు సాహాకు అండగా నిలిచారు. జర్నలిస్టు బెదిరింపులకు గురి చేయడం సరికాదని, ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ సాహాను కోరారు. భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి జర్నలిస్ట్ ఎపిసోడ్‌పై తీవ్రస్థాయిలో స్పందించాడు. క్రికెటర్‌ను ఓ జర్నలిస్ట్ ఇంటర్యూ పేరుతో బెదిరించడంపై ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ వెంటనే ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరాడు. ఇలాంటి ఘటనలు భారత జట్టుకు చేటు చేస్తాయన్న రవిశాస్త్రి ఆటగాళ్ళ ప్రైవసీని గౌరవించాలని సూచించాడు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సదరు జర్నలిస్టు ఎవరో అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి వారివల్ల జర్నలిజానికే చెడ్డపేరు వస్తుందంటూ పలువురు ప్రముఖులు, మాజీ ఆటగాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బీసీసీఐ సైతం తాజా వివాదంపై వివరాలు అడిగినట్టు సమాచారం.

కాగా శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సాహాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రిషబ్ పంత్‌ను పూర్తిస్థాయి వికెట్‌కీపర్‌గా మేనేజ్‌మెంట్ భావిస్తుండడం, అతనితో పాటు యువక్రికెటర్లకే అవకాశమివ్వాలని నిర్ణయించడంతోనే సాహాకు అవకాశం దక్కలేదని తెలుస్తోంది. 37 ఏళ్ళ సాహా ధోనీ తర్వాత టెస్టుల్లో భారత వికెట్‌ కీపర్‌గా ఆడుతున్నాడు. అయితే పంత్ వచ్చిన తర్వాత సాహాకు అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే లంకతో సిరీస్‌కు ముందు సెలక్టర్లు, కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం తనను రిటైర్మెంట్‌పై ఆలోచించాలని సూచించినట్టు సాహా చెప్పుకొచ్చాడు.