Costliest Mango:ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే..!

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మామిడి పండ్ల ర‌కాల్లో ఒక‌దాని ఫోటోను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త హ‌ర్ష్ గోయోంకా ట్వీట్ చేశారు.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 03:52 PM IST

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మామిడి పండ్ల ర‌కాల్లో ఒక‌దాని ఫోటోను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త హ‌ర్ష్ గోయోంకా ట్వీట్ చేశారు. ఇది ఎక్కువ‌గా జపాన్‌లో పండే మియాజాకి అనే మామిడి ర‌కానికి చెందిన‌దిగా గుర్తించారు. ఇండియాలో ఈ ర‌కం మామిడి సాగు చాలా అరుదుగా ఉంటుంది. ఒక‌వేళ ఇది సాగు చేయాలంటే దానికి క‌ఠిన‌మైన‌ భద్రతా ఏర్పాట్లు చేయాలని గోయెంకా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అసాధారణమైన రూబీ రంగులో ఉన్న జపనీస్ మామిడి జాతి.. మియాజాకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి అని.. ఇది కిలోకు ₹ 2.7 లక్షలకు విక్రయించార‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పరిహార్ అనే రైతు రెండు చెట్లను రక్షించడానికి ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఆరు కుక్కలను పెట్టాడ‌ని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా ఉంద‌ని వెల్ల‌డించారు. రైతు పరిహార్ రైలు ప్రయాణం చేస్తున్న స‌మ‌యంలో ఓ వ్యక్తి నుండి మియాజాకి మొక్కను తీసుకున్నాడు. ఆ చెట్టు రూబీ రంగులో ఉన్న జపనీస్ మామిడి పండ్లను కలిగి ఉంటుందని ప‌రిహార్‌కి తెలియ‌దు.. ఆ మొక్క‌ని వేసిన కాపుకు వ‌చ్చిన త‌రువాత దానిని డిమాండ్ చూసి ప‌రిహార్ దంప‌తులు ఆశ్చ‌ర్య‌పోయారు.

మియాజాకి మామిడిని వాటి ఆకారం, ఎర్రటి రంగు కారణంగా తరచుగా “ఎగ్స్ ఆఫ్ సన్‌షైన్” (జపనీస్‌లో తైయో-నో-తమాగో) అని పిలుస్తారు. మియాజాకి మామిడి పండ్లకు జపాన్‌లోని నగరం నుండి పేరు వచ్చింది. సగటున ఒక మామిడి పండు 350 గ్రాముల బరువు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉన్న మామిడిని ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్య గరిష్ట పంట కాలంలో పండిస్తారు. మియాజాకి అనేది ఒక రకమైన “ఇర్విన్” మామిడి. ఇది జపనీస్ ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ ప్రకారం, ఆగ్నేయాసియాలో విస్తృతంగా పండే పసుపు “పెలికాన్ మామిడి” నుండి భిన్నంగా ఉంటుంది. మియాజాకి యొక్క మామిడిపండ్లు జపాన్ అంతటా రవాణా చేస్తున్నారు. వాటి ఉత్పత్తి పరిమాణం జపాన్‌లో ఒకినావా తర్వాత రెండవ స్థానంలో ఉంది.