Shoaib Akhtar: కోహ్లీని బలహీనుడిగా మార్చేస్తున్నారు!

విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 05:50 PM IST

విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండేళ్లుగా ఒక్క సెంచరీ లేని కోహ్లిని.. ఈ ఐపీఎల్ సీజన్‌ మరింత కుంగదీసింది. గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అద్భుతంగా రాణించిన కోహ్లీ ఈసారి మాత్రం పరుగులు చేసేందుకు బాగా ఇబ్బంది పడుతున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విరాట్‌ మరోసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఈ సీజన్‌లో అతనికిది మూడో గోల్డెన్‌ డక్‌ కాగా.. ఐపీఎల్‌లో ఆరోది. ప్రస్తుతం విరాట్ ఫామ్ పైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ విరాట్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లిని పూర్తి బలహీనుడిగా మార్చేస్తున్నారని అక్తర్ అన్నాడు. కోహ్లిలాంటి ప్లేయర్‌ కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదని, అయితే తనపై ఉన్న తీవ్ర ఒత్తిడి కారణంగా అతడు రన్స్‌ చేయలేకపోతున్నాడని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.
ఒకప్పుడు పరుగుల వరద పారించిన తాను ఇప్పుడు ఎందుకిలా ఆడుతున్నానో అని కోహ్లి కూడా అనుకుంటూ ఉండొచ్చని అక్తర్‌ అన్నాడు.
ఐపీఎల్‌లో ఇప్పటికే అతడు తానేంటో నిరూపించుకున్నాడనీ, ప్రస్తుతం అతడు క్రీజులోకి వెళ్లి గేమ్‌ను ఎంజాయ్ చేయాలనీ సూచించాడు. రన్స్‌ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడనీ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో విరాట్‌ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లలో 216 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ కొన్ని రోజులు ఆటకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ లాంటి మాజీలు సూచిస్తున్నారు.