Site icon HashtagU Telugu

Uttar Pradesh: భార్యను వివస్త్రను చేసి..రోడ్డుపై పరిగెత్తించి కొట్టిన భర్త

uttarpradesh women assault

New Project (60)

Uttar Pradesh: కాలం మారింది.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ యుగంలో దేశం పరుగెడుతోంది. అయినా సరే.. ఈ నవసమాజంలో ఆడవాళ్లు ఇంకా అణచివేతకు గురవుతున్నారు. దేశం నలుమూలల్లో ప్రతిరోజూ ఎందరో ఇల్లాల్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అవమానాలకు గురవుతున్నారు. కామాంధుల చేతుల్లో తోలుబొమ్మలవుతున్నారు. కట్నం భూతం.. ఒక ఇల్లాలిని రోడ్డుపై వివస్త్రగా నిలబెట్టింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలోని హర్పూర్, బుదాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ భర్తతో పాటు బావ కూడా ఆమెను వివస్త్రను చేసి.. వీధుల్లో పరిగెత్తించి కొట్టారు. ఆపై గొంతునులిమి హత్యచేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపుకట్నం కోసం పెట్టే వేధింపులు, చిత్రహింసలను భరించలేక ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్ పూర్ కు చెందిన బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు అడిగిన దానికంటే ఎక్కువ కట్నమే ఇచ్చారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పెళ్లైనప్పటి నుంచి అదనపుకట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని, ఇంకా కట్నం తేవాలని అత్తమామలు తరచూ వేధించేవారని, కొట్టేవారని తెలిపింది. తన పిల్లల్ని కూడా చాలా సార్లు కొట్టి గాయపరిచారని బాధిత మహిళ ఆరోపించింది.

తన పుట్టింటి నుంచి డబ్బు తేవాలని భర్త, బావ ఒత్తిడి చేశారని, తన శరీరంపై బట్టల్ని తొలగించి చంపేందుకు వెంటపడటంతో.. తన ప్రాణాలను కాపాడుకునేందుకు వేరే దారిలేక బట్టలు లేకుండానే గ్రామంలో వీధులవెంట పరిగెత్తినట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. గ్రామస్తులు తనను అలాగే చూస్తూ ఉన్నారే తప్ప.. ఎవ్వరూ కాపాడేందుకు ముందుకు రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. కర్రలతో తీవ్రంగా కొట్టి.. గొంతునులిమి హత్యచేసేందుకు ప్రయత్నించారని వాపోయింది. చివరికి కొందరు కాపాడి.. వేసుకునేందుకు బట్టలు ఇచ్చారని చెప్పింది. అదనపు కట్నం కోసం ఇంతటి దారుణానికి పాల్పడిన తన భర్త, బావ, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆ మహిళ పోలీసులను వేడుకుంది.