Site icon HashtagU Telugu

Delhi: అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్ పై కత్తితో దాడి చేసిన మహిళ.. పోలిసులు అడ్డురావడంతో వారిపై కూడా?

Delhi

Delhi

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అడ్రస్ అడిగిన పాపానికి ఒక డెలివరీ బాయ్ పై ఒక మహిళ కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసింది. అడ్డు వచ్చిన పోలీసుల పై కూడా ఆమె దాడి చేసింది. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టర్‌-23లో చోటు చేసుకుంది. ఒక ప్రవేటు కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గోలూ అనే 18 ఏళ్ళ యువకుడు రాత్రి వేళ డెలివరీ ఇచ్చేందుకు డీడీఏ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడున్న 42 ఏళ్ల మహిళను ఒక అడ్రస్ చెప్పమని అడిగాడు. వెంటనే ఆ మహిళ కోపగించుకుంటూ, ఆ యువకునిపై కత్తితో మూడుసార్లు దాడి చేసింది.

ఆ యువకుడు బాధతో కేకలు పెడుడుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆ మహిళను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ మహిళ కత్తితో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడికి యత్నించింది. అయితే ఆమె దగ్గర ఉన్న కత్తిని అక్కడే ఉన్న ఇతర మహిళల సహాయంతో స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆ మహిళ పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని పీసీఆర్‌ వ్యాన్‌తో పాటు అక్కడున్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. మహిళ ప్రవర్తన పట్ల విసిగిపోయినా పోలీసులు ఎంతో కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ డ్రామా గంటపాటు కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆ మహిళ సొసైటీలో ఒక అద్దె ఇంటిలో ఒంటరిగా ఉంటోంది. గతంలోనూ ఆమె ఇలాంటి దాడులకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన డెలివరీ బాయ్‌ గోలూ తెలిపిన వివరాల ప్రకారం.. అతను ఆమెను ఏదో చిరునామా అడగగా, ఆమె వెంటనే అతనిని స్కూటీ నుంచి కిందకు తోసివేసి, వాహనం తాళాలు లాక్కొన్ని వాటిని పారవేసింది. తరువాత అతనిపై కత్తితో దాడికి దిగింది. రోడ్డుపై నానా హంగామా చేసిన మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయనందున పోలీసులు ఇంకా తదుపరి చర్యలు చేపట్టలేదు.