Nagrakurnool: మహిళా ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం, ఆపరేషన్ చేసి, కడుపులో దూది మరిచిపోయి!

వైద్యులు కడుపులో పత్తిని మరిచిపోయి కుట్లు వేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ వారం రోజులకే మృతి చెందింది.

  • Written By:
  • Updated On - August 23, 2023 / 05:23 PM IST

వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాగర్‌కర్నూల్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అదే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయగా వైద్యులు కడుపులో పత్తిని మరిచిపోయి కుట్లు వేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ వారం రోజులకే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆగస్టు 15న ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం రోజునే వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో వైద్యులు కడుపులో పత్తిని మరిచిపోయారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన బాధితురాలు రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆపరేషన్ జరిగిన వారం తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. ఆగస్టు 22న కుటుంబ సభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

ప్రైవేటు వైద్యులు ఆమెను పరిశీలించి వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని బంధువులకు సూచించారు. ఎన్నో కష్టనష్టాల తర్వాత ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. బాధితురాలు రోజా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కడుపులో దూది ఉండటంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బుధవారం మృతదేహాన్ని అచ్చంపేటకు తీసుకొచ్చిన బంధువులు అక్కడి ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Also Read: MLC Kavitha: జంతర్ మంతర్ వద్ద మళ్లీ ధర్నా చేస్తా, సోనియా, స్మృతిలను పిలుస్తా: ఎమ్మెల్సీ కవిత