Site icon HashtagU Telugu

News GST Rule:కొత్త సంవ‌త్స‌రంలో కొత్త జీఎస్టీ రూల్స్‌.. ఈ వ‌స్తువులపై పెర‌గ‌నున్న ధ‌ర‌లు..?

Gst Imresizer

Gst Imresizer

కొత్త సంవ‌త్స‌రంలో వ‌స్తు సేవ‌ల ప‌న్నులో మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన ప్రక్రియలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దుస్తులు, పాదరక్షలు వంటి వస్తువులు జనవరి 1, 2022 నుండి ఖరీదైనవిగా మార‌నున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటిపై వస్తువులపై GSTని 5% నుండి 12%కి పెంచింది. ఒక్కో పీస్‌కు రూ.1,000 వరకు ధర ఉండే దుస్తులపై జీఎస్టీ రేటు 5% నుంచి 12%కి పెరిగింది. నేసిన వస్త్రాలు, సింథటిక్ నూలు, దుప్పట్లు, టెంట్లు, అలాగే టేబుల్‌క్లాత్‌లు లేదా సర్వియెట్‌లు వంటి ఉపకరణాలతో సహా వస్త్రాల ధరలు కూడా 5% నుండి 12%కి పెర‌గ‌నున్నాయి.. పాదరక్షలపై జీఎస్టీ రేటు (ఒక జతకు రూ. 1,000 వరకు ఉంటుంది) కూడా 5% నుండి 12%కి పెంచబడింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నవంబర్ 18న ఈ పెంపును తెలిపింది. దుస్తులపై GSTని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ‌స్త్ర వ్యాపారులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ పెంపు వ‌స్త్ర పరిశ్రమపై ప్రభావం చూపుతుందని భారత వస్త్ర తయారీదారుల సంఘం (CMAI) తెలిపింది. ముడిసరుకు ధరలు, ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్ మరియు సరకు రవాణాపై ద్రవ్యోల్బణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంద‌ని తెలిపింది.

ఓలా, ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుండి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై ఇప్పటికే ఉన్న మినహాయింపును ముగించి 5% GST విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1 నుండి ఫుడ్ డెలివరీ యాప్‌లు తాము చేసే డెలివరీల కోసం రెస్టారెంట్‌ల స్థానంలో 5% జీఎస్టీని సేకరించి ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రెస్టారెంట్లు జీఎస్టీని చెల్లించేవి.. ఇప్పుడు, రెస్టారెంట్లకు బదులుగా జొమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్లు పన్ను చెల్లించవలసి ఉంటుంది.

Exit mobile version