Presidents Rule : “హింసను ఆపండి. లేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను… ఆయుధాలు చేతపట్టిన మైతై ప్రజలు దేనిపైనా దాడి చేయొద్దు..శాంతిని కాపాడాలి. రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి సహకరించాలి” అని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సోమవారం చేసిన ప్రకటన రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అనే సంకేతాలను ఇచ్చింది.
“మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఉపేక్షించొద్దు.. తక్షణమే అత్యున్నత స్థాయిలో దృష్టి సారించాలి” అని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ (రిటైర్డ్) వేద్ ప్రకాష్ మాలిక్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకొని ఏదో ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.
మణిపూర్ లో హింసాకాండ ఎంతకూ ఆగడం లేదు. గత 45 రోజులుగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఈ పరిష్కార మార్గాల్లో “రాష్ట్రపతి పాలన”(Presidents Rule) అనేది చిట్టచివరి ఆప్షన్ గా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న మిగితా ఆప్షన్లను అమలు చేసే వైపే కేంద్రం మొగ్గు చూపొచ్చని అంటున్నారు. ఈక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌ను ఆ పదవిలో కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై కేంద్ర సర్కారు డైలమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆయనను సీఎం పదవి నుంచి తప్పిస్తే.. రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే మణిపూర్ లో మళ్ళీ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం [AFSPA] వంటివి అమలు చేయాల్సి వస్తుంది.
Also read : Manipur Violence: ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్‌పై ప్రధానికి విజ్ఞప్తి చేసిన మాజీ ఆర్మీ చీఫ్
అలా చేస్తే.. మైతై తెగ బీజేపీకి దూరమయ్యే ముప్పు
గతంలో AFSPA చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాలలో అమలు నుంచి వెనక్కి తీసుకోవడానికి కేంద్రం ఎంతో చెమటోడ్చింది. అందుకే మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితులను కేంద్రం క్రియేట్ చేసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు.”రాష్ట్రపతి పాలన”ను చిట్టచివరి ఆప్షన్ గా పెట్టుకున్నందున.. ముఖ్యమంత్రి తొలగింపు అనే రిస్కీ నిర్ణయాన్ని కేంద్రం తీసుకోకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీరేన్ సింగ్‌ను సీఎం సీటు నుంచి తప్పిస్తే .. మణిపూర్ లో 50 శాతానికిపైగా ఓటర్లున్న మైతై తెగ బీజేపీకి దూరమయ్యే ముప్పు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతరత్రా ఆప్షన్స్ లో బెస్ట్ వి ఏవైనా ఉంటే వాటిని కేంద్రం ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.