UP Polls: యూపీలో పార్టీలు చేస్తున్నదిదే – ఉచితాల‌తో ఓట్ల వేట కోసం..

ఊరుమ్మడి ప‌నులు, స‌మాజం మొత్తానికి ప‌నికొచ్చే ప‌థ‌కాల‌క‌న్నా వ్యక్తిగ‌తంగా ప్రయోజ‌నం క‌లిగించే స్కీముల‌కే ఓట్లు ప‌డుతాయ‌ని గ్రహించిన రాజ‌కీయ పార్టీలు ఉత్తర‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో ఈ సూత్రాన్నే అమ‌లు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - February 24, 2022 / 08:27 AM IST

ఊరుమ్మడి ప‌నులు, స‌మాజం మొత్తానికి ప‌నికొచ్చే ప‌థ‌కాల‌క‌న్నా వ్యక్తిగ‌తంగా ప్రయోజ‌నం క‌లిగించే స్కీముల‌కే ఓట్లు ప‌డుతాయ‌ని గ్రహించిన రాజ‌కీయ పార్టీలు ఉత్తర‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో ఈ సూత్రాన్నే అమ‌లు చేస్తున్నాయి. నాకేంటి లాభం అని ఓట‌ర్లు అడిగితే అందుకు జ‌వాబు చెప్పగ‌లిగేలా ప‌థ‌కాలు ఉండాల‌ని భావించి అందుకు త‌గ్గట్టుగా ఎన్నికల హామీలు ఇచ్చి వాటిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

ఉచితాల విష‌యంలో bjp ప్రభుత్వం ముందంజ‌లో ఉంది. ఉత్తరప్రదేశ్ జ‌నసంఖ్య దేశ జ‌నాభాలో 16.5 శాతం. ఆ రేషియోకు మించి కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాలు అమ‌ల‌య్యాయి. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జ‌మ చేసే కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు 20 శాతం రైతులు ప్రయోజ‌నం పొందారు. స్వచ్ఛ భార‌త్ కింద అమ‌లు చేసిన మ‌రుగుదొడ్ల నిర్మాణ ప‌థ‌కం కింద కూడా 20 శాతం ప్రజ‌ల‌కు నిధులు అందాయి.

ఇవి కాకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాల ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది. భ‌వ‌న నిర్మాణ రంగ కూలీల కుమార్తెల పెళ్లిళ్ల కోసం రూ. 75 వేలు వంతున ఆర్థిక సాయం చేసింది. ఉచిత రేష‌న్ స‌రేస‌రి. ఇవ‌న్నీ ప్రజ‌ల‌పై ప్రభావం చూపాయ‌ని, ఇవ‌న్నీ ఓట్లను కురిపిస్తాయ‌ని అధికార పార్టీ గ‌ట్టి న‌మ్మకంతో ఉంది. యూపీలో దాదాపు 15 కోట్ల మంది ఓట‌ర్లు ఉంటే సుమారు 6 కోట్ల మందికి ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా ల‌బ్ధి క‌లిగింద‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్రచారం చేస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కూడా వెన‌క్కి త‌గ్గలేదు. అస‌లు ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని ప్రారంభించింది త‌మ ప్రభుత్వమేన‌ని గుర్తు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అద‌నంగా నెల‌కు కిలో ఆవ‌నూనెను ఉచితంగా ఇస్తామ‌ని కూడా చెబుతున్నారు. ఇత‌ర అంశాల క‌న్నా ఉచిత ప‌థ‌కాల‌పైనే అధికంగా ప్రచారం జ‌రుగుతుండ‌డంతో ఈ అంశం మరోసారి చర్చల్లో నిలిచింది.