తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. ఎప్పుడూ కూల్ గా కనిపించే మంత్రి కేటీఆర్.. కంటోన్మెంట్ బోర్డు అంశంపై మండిపడ్డారు. దీనికి కారణం ఉంది. ఆర్మీ పరిధిలో ఉన్న ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఉంది. అంతమాత్రాన తెలంగాణ ప్రభుత్వం కాని, జీహెచ్ఎంసీ కాని సూచనలు చేస్తే పట్టించుకోరా అన్నది కేటీఆర్ అభ్యంతరం. కానీ దీని వెనుక కారణాలు తెలియాలంటే.. ఈస్టిండియా కంపెనీ రోజులకు వెళ్లాలి.
ఏఎస్ఐ సమీపంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో చెక్ డ్యామ్ ను నిర్మించారు. కానీ దానివల్ల చేరిన నీటితో ఆ దిగువ భాగంలో ఉన్న నదీమ్ కాలనీలోకి నీరు వచ్చేస్తోంది. ఇది ఆ ప్రాంత వాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైగా కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చాలాసార్లు సూచనలు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఇలా లాభం లేదనుకుని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పరిస్థితి ఇలాగే ఉంటే నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించారు. దీంతో అందరి దృష్టీ దీనిపై పడింది. అసలేంటీ కంటోన్మెంట్ వివాదమని చూస్తే.. అప్పట్లో ఈస్టిండియా కంపెనీవాళ్లు మన దేశంలో ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల కోసం రక్షణను ఏర్పాటుచేసుకున్నారు. ఆ సాయుధ బలగాలు ఉండే ప్రాంతాన్నే కంటోన్మెంట్లుగా పిలిచేవారు. నిజాం జమానాలోనే సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ ఉంది. స్వాతంత్ర్యం తరువాత అది మన సైన్యం పరిధిలోకి వచ్చింది. కాకపోతే కాలక్రమంలో… అంటే 1956లో ఆ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాలను హైదరాబాద్ మున్సిపాలిటీలో చేర్చారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం దాదాపు 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఆర్మీ చేతుల్లో దాదాపు ఏడువేల ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 3 వేల ఎకరాల్లో ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఈ ప్రాంతం ఇప్పటికీ కంటోన్మెంట్ బోర్డు పరిపాలనలోనే ఉంటుంది. ఈ బోర్డు ఆర్మీ నిర్వహణలో ఉంటుంది. ఈ కంటోన్మెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ మధ్యలో ఉండడంతోనే సమస్యంతా వచ్చింది. అంటే.. మారేడ్ పల్లి, మల్కాజ్ గిరి, నేరేడ్ మెంట్.. ఇలా ఈ ప్రాంతాలకు వెళ్లే రోడ్లను ఆర్మీ అధికారులు ఆరేళ్ల కిందటే బ్లాక్ చేశారు. అదేమంటే భద్రతాపరమైన చర్యలని చెప్పారు. తరువాత ప్రభుత్వం, ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు పగటిపూట మాత్రం రాకపోకలకు అనుమతిస్తున్నారు.