Subsidy on Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహణాలపై సబ్సిడీకి ఎవరు అర్హులు? ఎలా పొందాలి?

పెట్రోల్ ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

Subsidy on Electric Vehicles : పెట్రోల్ ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు లాభం కలిగించే ఒక విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకుంటే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) కొనుగోలుపై ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాను ఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. FAME-2 నిబంధనల ప్రకారం మీరు లబ్ది పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

FAME పథకం కింద EV సబ్సిడీకి ఎవరు అర్హులు?

Ola, Ather, TVS, Revolt వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. Ola కంపెనీ యొక్క S1 Pro ధర దాదాపు రూ. 1,33,000, ఏథర్ కంపెనీ యొక్క 450X ధర రూ. 1,37,000, TVS కంపెనీ యొక్క iQube ధర రూ. 1,61,000 దాకా ఉంది. FAME-2 రూల్స్ ప్రకారం సబ్సిడీ అనేది వాహనం ధరలో దాదాపు 40 శాతం దాకా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీ సామర్ధ్యాన్ని కిలో వాట్ అవర్స్ లో కొలుస్తారు. ఒక కిలో వాట్ అవర్స్ బ్యాటరీ సామర్థ్యంపై రూ.15,000 దాకా సబ్సిడీ లభిస్తుంది. FAME-2 పథకంలో భాగంగా రూ.1.5 లక్షలకు పైగా ధర కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై మాత్రమే సబ్సిడీ ఇస్తారు. FAME ప్రోత్సాహకం మొత్తం దేశం అంతటా చెల్లుబాటు అవుతుంది. వినియోగదారుడు డిస్కౌంట్ ధరను చెల్లించి xEVని కొనుగోలు చేసేటప్పుడు ముందుగా డిమాండ్ ప్రోత్సాహక ప్రయోజనాన్ని అందుకుంటారు.అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ. 1.5 లక్షలకు మించకుండా బిల్లింగ్స్ చేసే విషయంలో మాయాజాలం చేస్తున్నాయి. స్కూటర్ కు వేరుగా .. ఛార్జర్ కు వేరుగా బిల్లులు చేసి కొనుగోలుదారుడి చేతిలో పెడుతున్నాయి. దీనివల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు ధర రూ. 1.5 లక్షలకు మించడం లేదు.

ఛార్జర్ ధర బిల్లులో కలపకపోవడంతో..

స్కూటర్ ఎలక్ట్రిక్ ఛార్జర్ ధర కెపాసిటీని బట్టి రూ. 10,000 నుంచి రూ. 20,000 దాకా ఉంటుంది. Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,33,000కు ఛార్జర్ ధర కలిస్తే ఈజీగా మొత్తం బిల్లు లక్షన్నర దాతుంటుంది. ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,37,000కు ఛార్జర్ ధర కలిస్తే మొత్తం బిల్లు లక్షన్నర దాతుంటుంది. ఇదే జరిగితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారుడు FAME-2 రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునేందుకు అర్హుడు అవుతాడు. ఇప్పటికైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు కొనొగోలుదారుల ప్రయోజనాలను దెబ్బతీయని విధంగా ఇన్‌వాయిస్ వ్యవస్థను మార్చుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఛార్జర్ డబ్బులు రీఫండ్ చేస్తామంటున్న ఓలా .. ఎందుకంటే ?

ఈనేపథ్యంలో తాజాగా ఓలా కంపెనీ ఒక కీలక ప్రకటన చేసింది. ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేసి.. దాని ఛార్జర్ కోసం ఎక్కడైనా డబ్బు ఖర్చు చేసినట్లయితే, ఇప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి పొందే ఛాన్స్ వచ్చింది. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఛార్జర్‌ను కొనేందుకు రూ.9,000 నుంచి రూ.19,000 వరకు వెచ్చించిన కొనుగోలుదారులకు ఆ మొత్తాన్ని రీఫండ్ ఇస్తామని కంపెనీ సోమవారం వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ ఛార్జర్ ధరను కొనుగోలుదారులకు తిరిగి ఇచ్చినప్పుడే.. కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన సబ్సిడీ అమౌంట్ ను రిలీజ్ చేస్తామని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడంతో ఓలా కంపెనీ ఈ ప్రకటన చేసింది.

తెలంగాణలో మొదటి 2 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లకు..

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 ప్రకారం.. రాష్ట్రంలో సేల్ అయ్యే మొదటి 200,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 5,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీల్ కమర్షియల్ ప్యాసింజర్ వాహనాలు, 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీల్ గూడ్స్ ఇ-క్యారియర్లు, 5,000 ప్రైవేట్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, 500 ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100 శాతం మినహాయింపుకు అర్హులు. ఈవీ, ఈఎస్‌ఎస్‌ తయారీ కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని రావిర్యాల్‌, మహేశ్వరం, దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు (ఈఎంసీలు), ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సర్కారు తెలిపింది. EV బ్యాటరీ తయారీని కూడా ప్రోత్సహించాలని భావిస్తోంది.

Also Read:  GST Records: జీఎస్టీలో భారత్ రికార్డు.. గుడ్ న్యూస్ అంటూ మోడీ ట్వీట్!