CP Radhakrishnan: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను (CP Radhakrishnan) అభ్యర్థిగా ఆదివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పార్టీ అగ్ర నాయకులు హాజరైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసిన దాదాపు నెల రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అధికార ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. “మేము ప్రతిపక్షాలతో కూడా మాట్లాడతాము. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా వారి మద్దతును కూడా కోరుతాము. గతంలో చెప్పినట్లుగానే మేము వారితో టచ్‌లో ఉన్నాము. మా సీనియర్ నాయకులు గతంలోనూ, ఇప్పుడూ వారితో సంప్రదింపులు జరుపుతారు. మా ఎన్‌డీఏ మిత్రులందరూ మాకు మద్దతు తెలిపారు. సీపీ రాధాకృష్ణన్ మా ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి” అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
Also Read: Minister Seethakka: అలసత్వం వద్దు.. అంతా అప్రమత్తంగా ఉండండి: మంత్రి సీతక్క
రాజకీయ ప్రస్థానం
1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. భారతీయ జనతా పార్టీలో ఆయన వివిధ కీలక పదవులను నిర్వహించారు. తమిళనాడు బీజేపీకి ఏడవ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తమిళనాడు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన రాధాకృష్ణన్, కోయంబత్తూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
గవర్నర్‌గా సేవలు
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా అనేక రాష్ట్రాలకు సేవలందించారు. ఆయన ఝార్ఖండ్ పదవ గవర్నర్‌గా ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు పనిచేశారు. ఆ తర్వాత, జూలై 31, 2024న మహారాష్ట్ర 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో మార్చి 2024 నుండి జూలై 2024 వరకు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. అధికారికంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడటంతో వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌గా, ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయనకున్న అనుభవం ఈ పదవికి ఎంతో ఉపయోగపడుతుందని ఎన్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి.