Site icon HashtagU Telugu

Manipur Violence: మణిపూర్ మంటలు చల్లారేదెపుడు..?

Manipur Violence

A committee on Manipur Violence under Governor Anusuiya Uikey

By: డా.ప్రసాదమూర్తి

Manipur Violence: మణిపూర్ (Manipur Violence)లో పరిస్థితి చక్కబడిందని, అక్కడ ఐదు నెలలుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించి వారం రోజులు కూడా కాలేదు. మళ్లీ అకస్మాత్తుగా మణిపూర్ హింసకాండ వార్తల్లోకి ఎక్కింది. దేహంలో ఒక భాగం గాయపడి అది క్రమంగా రక్తమోడుతూ ఉంటే మిగిలిన దేహానికి అంతటికీ ఏమంత క్షేమం కాదు. అలాగే దేశంలో ఒక భాగం, అది ఎంత చిన్న ప్రాంతమైనా, అక్కడ విద్వేషం, హింస, ఘర్షణ నెలకొని నెలల తరబడి కొనసాగుతుంటే మిగిలిన దేశం సంతోషంగా ఉండలేదు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా సకల జాతుల మతాల ప్రాంతాల భాషల సమహారంగా ప్రసిద్ధికెక్కింది. ఇలాంటి దేశంలో ఏ ఒక్క చిన్న రాష్ట్రంలో అలజడి చెలరేగినా, ప్రజల మధ్య విద్వేషం పెచ్చరిల్లినా అది దేశానికంతటికీ విషాదకరంగానే మారుతుంది. మణిపూర్ ఘటనలు చూస్తుంటే దేశం పట్ల అనురక్తి, అనురాగం కలవాలందరికి తీవ్రమైన మనస్థాపమే కలుగుతుంది.

మే 5వ తేదీన మణిపూర్ లో విధించిన ఇంటర్నెట్ సేవల నిషేధం గడిచిన బుధవారం నాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మణిపూర్ క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని దేశమంతా సంతోషించింది. అయితే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన మరుక్షణమే మణుపూర్లో జాతుల మధ్య ఘర్షణ ఎంత అమానవీయ, అరాచక విధ్వంసాలకు దారితీసిందో ప్రపంచానికంతటికీ అర్థమయిపోయింది. ఎప్పుడో జరిగిన ఘటనలు, దృశ్యాలు, వార్తలు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో వెలుగు చూడడం ప్రారంభమైంది. జులైలో కిడ్నాప్ చేయబడిన ఇద్దరు విద్యార్థుల శవాలు ఇప్పుడు వెలుగు చూశాయి. ఈ వార్త దేశమంతా వైరల్ అయింది. దేనితో మణిపూర్లో మళ్లీ హింసాయుత వాతావరణం నెలకొంది.

విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. నాయకుల ఇళ్ళను ముట్టడించారు. మళ్లీ విధ్వంసం, మళ్లీ కాల్పులు అల్లకల్లోల స్థితి నెలకొంది. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మణిపూర్ ప్రభుత్వం సాయుధ బలగాల ప్రత్యేక భద్రతా చట్టం (AFSPA)ను మరో ఆరు నెలల పాటు కొండ ప్రాంత జిల్లాల్లో పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, పునరుద్ధరించిన ఇంటర్నెట్ సేవలను తిరిగి నిషేధిస్తున్నట్లు కూడా మణిపూర్ ముఖ్యమంత్రి ప్రకటించారు‌ మణిపూర్ లో కేవలం 19 పోలీస్ స్టేషన్ల పరిధి మినహా మిగిలిన రాష్ట్రమంతా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ పరిణామాలు చూస్తుంటే మణిపూర్ లో సాధారణ స్థితి కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు.

Also Read: Underwater Swarm Drones: అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్‌లు అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?

మణిపూర్ లో జాతుల ఘర్షణ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కూడా మైతేయి, కుకీజాతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగని ఈ పాపాన్ని మరెవరి మీదో నెట్టివేసి మణుపూర్ రావణ కాష్ఠంలా తగలబడుతుంటే చోద్యం చూస్తూ ఊరుకోవడం చారిత్రక తప్పిదమే అవుతుంది. మణిపూర్ సమస్యకు పరిష్కారం భద్రతా బలగాలు, ప్రత్యేక చట్టాలు, అణిచివేతలు కాదు. రెండు జాతుల మధ్య ఉన్న సమస్యలకు మౌలిక కారణాలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నడుం కట్టాలి. గత ప్రభుత్వాల మీద నెపంవేసి ఇప్పటి ప్రభుత్వాలు చలికాచుకునే రాజకీయాలు చేస్తే మణిపూర్ లాంటి ప్రాంతాలు తగలబడుతూనే ఉంటాయి. అందుకే ప్రతిపక్షాలన్నీ మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి ముందుగా అక్కడ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి అని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.

మణిపూర్ లో ఒక వర్గం ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో కొనసాగుతున్న వారు ప్రస్తుత సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనలేదు. రాజకీయాలకు అతీతంగా మణిపూర్ సమస్యను పరిష్కరించాలి. అలా జరగాలంటే అక్కడ ఉన్న బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించి సమస్యను సమూలంగా పరిష్కరించడానికి నడుం కట్టాలి. ఇదే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తక్షణమే మణుపూర్ ప్రభుత్వాన్ని భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రజల మధ్య రగులుతున్న మంటల్ని ఆర్పడానికి రాజకీయ పక్షాల మధ్య రాజకీయాలు సమసి పోవాలి. రాజకీయాలకు అతీతంగానే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి కేంద్రం ఇప్పటికైనా చైతన్యంతో, చిత్తశుద్ధితో మణిపూర్ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తుందని ఆశిద్దాం.