Site icon HashtagU Telugu

KCR’s Agenda: కేసీఆర్.. వాట్ నెక్ట్స్!

Cm Kcr

Cm Kcr

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తన తదుపరి రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. కేసీఆర్ ఇటీవలనే ఢిల్లీ పర్యటన, బెంగుళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి పొలిటికల్ హీట్ ను పెంచేశారు. అయితే కేసీఆర్ మే నెలాఖరులో బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించాలని అనుకున్నారు. కానీ ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో జాతీయ సమ్మేళనం నిర్వహించాలన్న టీఆర్‌ఎస్‌ అధినేత ప్రణాళికకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉత్తరాది ప్రజలకు ‘అద్వితీయ’ సంక్షేమ పథకాలను తెలియజేసేందుకు ప్రకటనల ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం సఫలమైందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జాతీయ సమస్యలపై చర్చిస్తూ, రాజకీయ పోకడలను విశ్లేషిస్తూ ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు.  చైనా సరిహద్దుల్లో జరిగిన గాల్వాన్‌ ఘర్షణల్లో మరణించిన సైనికులకు, ఢిల్లీ శివార్లలో జరిగిన రైతు వ్యతిరేక చట్టాలపై జరిగిన ఆందోళనలో మరణించిన రైతులకు ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రయత్నం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించారని, పార్టీకి ఎంతగానో లాభం చేకూరిందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.  దేశాభివృద్ధి కోసం తన ఎజెండాను ముందుకు తీసుకురావడంలో కూడా కేసీఆర్ విజయం సాధించారని ఆయన మంత్రివర్గం పేర్కొంటుంది.

‘‘సిఎం కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదగడానికి అంచెలంచెలుగా కదులుతున్నారు. ఆయన ఎత్తుగడలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి” అని పార్టీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలను లేవనెత్తడం ద్వారా దేశ ప్రజలను ఆకర్షించడానికి టీఆర్‌ఎస్ అధినేత అనేక ఆలోచనలతో ఉన్నారు. నవంబర్ నుంచి జాతీయ రాజకీయాలకే టీఆర్‌ఎస్ అధినేత ఎక్కువ సమయం కేటాయిస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంగా తన జాతీయ రాజకీయాల గురించి కొన్ని పెద్ద ప్రకటనలు చేసే ఆలోచనలో ఉన్నారని టీఆర్ఎస్ ప్రధాన నాయకులు జోస్యం చెబుతున్నారు.