Russia Private Army : రష్యా ప్రైవేటు సైన్యాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా ?  

Russia Private Army : రష్యాలోని పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీ ఒప్పందంతో వెనక్కి తగ్గిన  ప్రైవేటు సైన్యం "వాగ్నర్ గ్రూప్" ఫ్యూచర్ పై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి.

  • Written By:
  • Updated On - June 26, 2023 / 08:07 AM IST

Russia Private Army : రష్యాలోని పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీ ఒప్పందంతో వెనక్కి తగ్గిన  ప్రైవేటు సైన్యం “వాగ్నర్ గ్రూప్” ఫ్యూచర్ పై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. తిరుగుబాటు చేసిన తన ప్రైవేటు సైనికులను క్షమించి రష్యా ఆర్మీలో కొనసాగించాలని వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్.. ప్రెసిడెంట్ పుతిన్ ను కోరాడు. మరి.. ప్రిగోజిన్ పై కోపంతో మండిపోతున్న పుతిన్ అతడి మాటలు వింటారా ? అనేదే పెద్ద ప్రశ్న. ఇలాంటప్పుడు  వాగ్నర్ గ్రూప్ లోని వేలాది మంది సుశిక్షితులైన ప్రైవేట్ సైనికులను పుతిన్ ఏం చేస్తారు ? అనే దానిపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. 

కిరాయి సైన్యం(Russia Private Army) వాగ్నర్ గ్రూప్ ను పుతిన్ రద్దు చేయడం ఖాయమని తెలుస్తోంది. వాస్తవానికి వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుపై.. ప్రిగోజిన్ చేస్తున్న సైనిక కుట్రపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు ముందే నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందనే టాక్ వినిపిస్తోంది. ముందస్తు సమాచారం ఉండటం వల్లే.. వాగ్నర్ గ్రూప్ లో పనిచేస్తున్న ప్రైవేట్ సైనికులంతా రష్యా రక్షణ శాఖ పరిధిలోకి రావాలనే ఆర్డర్స్ ను జూన్ 10నే పుతిన్ ఇచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రైవేట్ సైన్యం ఇక ఉండదని.. రష్యా ఆర్మీలో కలిసిపోవాల్సిందే అని పుతిన్ జారీ చేసిన ఆ ఆర్డర్స్ లో స్పష్టంగా ఉంది. ప్రైవేట్ సైనికులంతా ఇకపై నేరుగా రష్యా ఆర్మీ పర్యవేక్షణలో పనిచేయాలని, ఈమేరకు అగ్రిమెంట్ పేపర్స్ పై సంతకాలు చేయాలని జూన్ నెల మొదటివారం నుంచే రష్యా రక్షణ శాఖ తేల్చి చెబుతోంది. దీంతో ఒత్తిడికి గురైన ప్రిగోజిన్ తాను అనుకున్న టైం కంటే ముందే సైనిక తిరుగుబాటు చేసి ఫెయిల్ అయ్యాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పుతిన్ తో రాజీ కుదిరిందని ప్రిగోజిన్ ప్రకటించడంతో వాగ్నర్ గ్రూప్ సేనలు మళ్ళీ ఉక్రెయిన్ లోని రష్యా ఆర్మీ స్థావరాలకు బయలుదేరాయి. అక్కడ రష్యా ఆర్మీతో కలిసి అవి పనిచేయనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు తీవ్రంగా సైనికుల కొరత ఏర్పడింది. మూడేళ్ళ శాలరీ అడ్వాన్స్ గా ఇస్తామంటూ యాడ్స్ ఇచ్చి మరీ ఆర్మీలోకి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ ను రద్దు చేసి.. అందులోని సైనికులను రష్యా ఆర్మీలో విలీనం చేసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

Also read : Russia Private Army Explained : పుతిన్ చెఫ్ పెట్టిన ప్రైవేటు సైన్యం..అసలు కథ

బెలారస్ కు ప్రిగోజిన్.. లుకషెంకో భరిస్తాడా ?  

పుతిన్ సర్కారుతో కుదిరిన డీల్ ప్రకారం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్ కు వెళ్లిపోవాల్సి ఉంది. రాజీ ఒప్పందంలో భాగంగా రష్యా ప్రభుత్వం అతడిని ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి బెలారస్ లో దింపుతుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. ప్రిగోజిన్ తో చర్చలు జరిపిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఒక నియంత. ఆయన 1994 నుంచి బెలారస్ ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్నారు. నిరసనలు నిర్వహించినందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు కఠినమైన జరిమానాలు విధించిన చరిత్ర లుకషెంకోకు ఉంది. అటువంటి నియంత.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ లాంటి తిరుగుబాటుదారుడిని ఎలా భరిస్తాడు ? అనేది బిగ్ క్వశ్చన్. న్యూక్లియర్ వార్ హెడ్స్ ను నెల క్రితమే బెలారస్ ఆర్మీకి రష్యా అందించింది. ప్రిగోజిన్ ఇప్పుడు బెలారస్ గడ్డపైకి అడుగుపెడితే.. పుతిన్ పై ప్రతీకారం కోసం వాటిని హైజాక్ చేసే గండం కూడా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాగ్నర్ గ్రూప్ కిరాయి సేనలు లిబియా, సిరియా సహా కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ ఉన్నాయని.. ప్రిగోజిన్ బెలారస్ కు వెళ్లి, అక్కడి నుంచి తన సేనలు ఉన్న మరేదైనా చోటుకు వలస వెళ్తాడనే అంచనాలు వెలువడుతున్నాయి.