Putin War: పుతిన్ సాధించేదేంటి.. పిడికెడు మట్టి తప్ప!

సైనిక చర్య రెండు ప్రాంతాలకే పరిమితం అంటూ మొదలుపెట్టి.. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది రష్యా. ఉక్రెయిన్ ప్రజలకు ప్రస్తుత పాలన నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పి..

  • Written By:
  • Publish Date - February 27, 2022 / 07:00 AM IST

సైనిక చర్య రెండు ప్రాంతాలకే పరిమితం అంటూ మొదలుపెట్టి.. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది రష్యా. ఉక్రెయిన్ ప్రజలకు ప్రస్తుత పాలన నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పి.. తన సొంతం అనుకున్న వాళ్లపైనే బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ దేశాల మాట వినడం లేదు.. స్వదేశంలో వినిపిస్తున్న నిరసనగళాలను లెక్కచేయడం లేదు.

ప్రస్తుతం పుతిన్ లక్ష్యం ఒక్కటే ఉన్నట్టుంది. అదే సోవియట్ రష్యాను మళ్లీ స్థాపించడం. ఇందుకోసం అడ్డొచ్చే ప్రపంచ దేశాలపై అణుబాంబులు వేయడానికైనా సిద్ధమేనంటూ వార్నింగ్ ఇస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

సరే, రేపటికో ఎప్పటికో యుద్ధం ముగుస్తుంది. ఆ తరువాత పరిస్థితేంటి? పుతిన్ సాధించేది ఏంటి? రష్యాపై ఆగ్రహంతో ఉన్న ఉక్రెయిన్లు పుతిన్ పాలనను స్వాగతిస్తారా? అప్పటి వరకు స్వతంత్ర దేశంగా, స్వతంత్రులుగా ఉన్న ఉక్రెయిన్ వాసులు పరాయి పాలన కింద ఉండగలరా?

ఇప్పటికే ఉన్న ఊరును, పుట్టిన గడ్డను వదిలి లక్షల మంది పక్క దేశాలకి వెళ్లిపోయారు. వాళ్ల పరిస్థితి ఎప్పటికైనా దారుణమే. పరాయి దేశ పాలనలో ఉండలేరు, అలాగని పక్క దేశానికి వెళ్లి పరాయి వాళ్లుగానూ బతకలేరు. ఆస్తులు, ఆప్తులను వదిలి పెట్టి బతికినన్నాళ్లు అదే ఆవేదనతో కుంగిపోతారు. ఇదేనా పుతిన్ సాధించేది?

పక్క దేశానికి వెళ్లలేని వాళ్లు, పుట్టిన ఊర్లో తప్ప బతుకు లేదనుకునే వాళ్లు ఉక్రెయిన్‌లోనే ఉండిపోక తప్పదు. రేప్పొద్దున ఉక్రెయిన్ సైన్యాన్ని ఓడించి దేశాన్ని హస్తగతం చేసుకున్నా గానీ.. ఉక్రెయిన్లు రష్యా పాలనను స్వాగతిస్తారని గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు బతికున్న వాళ్లు, వాళ్లకు పుట్టే బిడ్డలు రష్యాపై ద్వేషం పెంచుకోరా? ఇలా రెండు తరాల ఆగ్రహాన్ని రష్యా చవిచూడాల్సిందేనా? ఇదేనా పుతిన్ సాధించేది?

ఒకవేళ రష్యా పాలనను, రష్యా పాలకులను అంగీకరించని వాళ్లు రోడ్ల మీదకు వస్తే పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. ప్రపంచ దేశాలు చెబుతుంటేనే లెక్క చేయని రష్యా.. ఉక్రెయిన్ వాసులు ఉద్యమం పేరుతో రోడ్లపైకి వస్తే ఊరుకుంటుందా? అవసరమైతే క్రూరంగా అణచివేసేయొచ్చు. అంటే, ఉక్రేనియన్లు తమ జాతి వాళ్లే అని చెప్పుకుంటున్న రష్యా.. చివరికి తమ వాళ్ల మీదే క్రూరంగా ప్రవర్తించాల్సి రావొచ్చు. ఇదేనా పుతిన్ సాధించేది?

యుద్ధంలో ఓడిపోయిన దేశం ఎలా ఉంటుందో చరిత్ర చాలాసార్లు చెప్పింది. బలహీన దేశంలో ఎన్ని బలవంతపు అకృత్యాలు జరుగుతాయో ఇప్పటికీ చరిత్ర పుటల్లో ఉంది. రేప్పొద్దున మిలటరీ పాలనే చేయాల్సి వస్తే అకృత్యాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? గెలిచిన దేశం ఓడిన ప్రాంతంలోని మహిళలను, చివరికి ఎనిమిదేళ్ల బాలికలను సైతం శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేసిన ఘటనలు కోకొల్లలు. రేప్పొద్దున ఇలా జరగదని గ్యారెంటీ ఏంటి?

ఇప్పటికే టిండర్ లాంటి యాప్స్ ద్వారా రష్యా సైనికులు ఉక్రెయిన్ మహిళలకు అసభ్యకర ఫొటోలు, మేసేజ్‌లు పెడుతున్నారు. ఇంతకు తెగించిన వారు రేప్పొద్దున హద్దు దాటరని గ్యారెంటీ ఏంటి? ఉక్రెయిన్లో ఏం జరుగుతోందన్న వార్త ఒక్కటి కూడా రానీయకుండా అఘాయిత్యాలు చేస్తే పరిస్థితేంటి? ఇదేనా పుతిన్ సాధించేది?

పుతిన్ ఇంత చేసి సాధిస్తున్నదేంటి? ఆ పిడికెడు మట్టి కోసమా? పైగా ప్రపంచ దేశాలకు శత్రువై కూర్చున్నాడు. యూరప్‌లోని మెజారిటీ దేశాలన్నీ ఆంక్షలు విధిస్తున్నాయి. రేప్పొద్దున వ్యాపారం చేయాలన్నా, కావాల్సిన వస్తువు తెప్పించుకోవాలన్నా దేహీ అనాల్సిన పరిస్థితి.

చమురు, గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నా.. వాటిని అమ్ముకునే అవకాశం లేకపోతే ఏం చేయగలుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుంది. రష్యన్లు మరోసారి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పలు సంక్షోభాలతో దశాబ్దాల పాటు నలిగిపోవాల్సి వస్తుంది. ఇదేనా పుతిన్ సాధించేది?