Rajamouli Curse: టాలీవుడ్ హీరోలకు ‘రాజమౌళి’ శాపం!

SS రాజమౌళి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. RRR బ్లాక్‌బస్టర్ విజయంతో మరోసారి సత్తా చాటాడాయన.

  • Written By:
  • Updated On - May 11, 2022 / 11:26 PM IST

SS రాజమౌళి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. RRR బ్లాక్‌బస్టర్ విజయంతో మరోసారి సత్తా చాటాడాయన. ఈ దర్శకధీరుడితో పనిచేయడానికి ఏ హీరోనైనా ఇష్టపడతాడు. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే నటులు ఎంతోమంది. రాజమౌళితో సినిమా అనగానే ఎక్కడా లేని ఉత్సాహం చూపే హీరోలు.. ఒక్కింత నిరాశకు గురికావాల్సి కావాల్సివస్తోంది. ఎందుకంటే.. రాజమౌళితో పనిచేసే ఏ హీరో అయినా తమ నెక్ట్స్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలనుకుంటారు. కానీ అవన్నీ ఘోర పరాజయాలు అందిస్తుండటంతో జక్కన్న తో సినిమా అంటేనే ఆలోచించే పరిస్థితులున్నాయని టాలీవుడ్ టాక్. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ సినిమాతోనే మరోసారి  రుజువైంది. టాలీవుడ్ మెగా స్టార్ కూడా ‘రాజమౌళి సెంటిమెంట్’  గురించి బహిరంగగానే చెప్పారంటే.. ఇట్టే అర్థమవుతోంది. అయితే రాజమౌళి గండం కేవలం ఆచార్య కే కాదు.. ఇతర సినిమాలకూ ఉంది. ఒక్కసారి ఫ్లాష్ బ్లాక్ లోకి వెళ్తే..

బాహుబలి తర్వాత ప్రభాస్ కు డిజాస్టర్

బాహుబలి పార్ట్-1, పార్ట్-2 సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారాడు డార్లింగ్ ప్రభాస్. ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభాస్ కు తిరుగే ఉండదని భావించారు అందరూ. దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదనట్టుగా..  బాహుబలి తర్వాత విడుదలైన ‘సాహో’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హిందీలో ఒకే అనిపించుకున్నప్పటికీ, తెలుగులో పూర్తిగా నిరాశ పర్చింది. బాహుబలితో ఎక్కడా లేని క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ సాహోతో ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఆ సినిమాతో ప్రభాస్ రాజమౌళి (సెంటిమెంట్) శాపాన్ని కొనసాగించినట్టయింది. అంతేకాదు.. ‘బాహుబలి’  తర్వాత ప్రభాస్ లుక్ కూడా పూర్తిగా మారిపోయిందని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం గమనార్హం.

మెగా హీరోకు తప్పని గండం

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR లో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా హీరో రామ్ చరణ్ అదరగొట్టిన విషయం వెలిసిందే. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’..  RRR సినిమా తర్వాత 5 వారాల వ్యవధిలో విడుదలైంది. అయితే RRR బాక్సాఫీస్ వద్ద రూ. 1000+ కోట్ల గ్రాసర్ సాధిస్తే, ఆచార్య రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ చేరుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో చరణ్ రాజమౌళితో కలిసి ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కానీ విచిత్రమేమిటంటే.. మగధీర తర్వాత చేసిన ‘ఆరెంజ్’ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. రాజమౌళి శాపానికి రామ్ చరణ్ రెండుసార్లు బలయ్యాడు. ఇక నిర్మాత నాగబాబు ఎంతగానో నష్టపోయాడు కూడా. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ‘ఆర్ఆర్ఆర్’ గెస్ట్ రోల్ లో కనిపించిన అజయ్ దేవగన్ కూడా రాజమౌళి గండం నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన నెక్ట్స్ మూవీ ‘రన్‌వే 34’  పూర్తిగా నిరాశపర్చింది.

జూనియర్ పరిస్థితి ఏంటి?

రాజమౌళి శాపాన్ని బ్రేక్ చేయడంలో అసాధ్యమని రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ గా నటించి మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి చిత్రం ఇదేకావడం విశేషం. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామ్ చరణ్ ‘ఆచార్య’ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించడం. ఈ సారైనా ఎన్టీఆర్ రాజమౌళి శాపాన్ని బ్రేక్ చేస్తాడా..? అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  NTR30తోనైనా రాజమౌళి ఫొబియాకు చెక్ పెట్టేలా జూనియర్ ఎన్టీఆర్ హిట్ అందించాల్సిన అవసరం చాలా ఉంది.

కంటెంట్ చాలా కీలకం

టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా ఇక్కడో విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఏ వుడ్ అయినా  ‘కథే’ హీరో అని భావించాలి. హిట్స్, ఫ్లాప్స్ అనే వాటికి సెంటిమెంట్ అంటూ ఏమీ ఉండవు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను డైరెక్ట్ చేస్తే.. అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. రాజమౌళి తర్వాత ఆయా హీరోలు అత్యుత్తమ దర్శకులు, నిర్మాతలతో కలసి పనిచేయకపోవడమూ ప్రధాన కారణం కూడా. ఇక రాజమౌళి విషయానికొస్తే తన తదుపరి ప్రాజెక్ట్‌ మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నాడు. ‘SSMB28’ అని పేరు పెట్టారు. రాజమౌళి ఇటీవలే తాను మహేష్ బాబుతో మెగా-బడ్జెట్ యాక్షన్ ఎపిక్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ కూడా భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకుంటుందనీ, 2023 లో ప్రారంభమవుతుందనీ స్పష్టం చేశాడు. రాజమౌళి గండాన్ని ఏ హీరో బ్రేక్ చేస్తాడోనని టాలీవుడ్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది.