Site icon HashtagU Telugu

AP Panchayat Funds: పంచాయ‌తీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?

Ap Secretariat Imresizer

Ap Secretariat Imresizer

రాజ్యాంగం ప్ర‌కారం కేంద్రం, రాష్ట్రం, లోక‌ల్ బాడీస్‌గా పిలుచుకొనే పంచాయ‌తీలు…వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విష‌యంలో స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి. మూడంచెలు (త్రీ టెయిర్ ) విధానంగా పిలుచుకునే ఈ ఏర్పాటులో కింది వ్య‌వ‌స్థ అధికారాల‌ను దానికి పైన ఉండే వ్య‌వ‌స్థ తీసుకోకూడ‌దు. అలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధ‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే త‌మ అధికారాల‌ను, నిధుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసేసుకుంటోందని ఆరోపిస్తూ స‌ర్పంచులు ఆందోళ‌న‌కు దిగారు. కేంద్ర ప్ర‌భుత్వం నేరుగా ఇచ్చిన ఫండ్స్‌ను కూడా త‌మ‌కు తెలియ‌కుండానే రాష్ట్రం తీసుకుంద‌ని ఆరోపిస్తున్నారు. పంచాయ‌తీల cmfs అకౌంట్ల‌లో కేంద్రం ఒక‌సారి రూ.345 కోట్లు, మ‌రోసారి రూ.969 కోట్లు జ‌మ చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఖాతాలు జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. క‌రెంటు ఛార్జీల కోస‌మ‌ని చెప్పి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే వీటిని తీసేసుకుంది. త‌మ‌కు తెలియ‌కుండా త‌మ అకౌంట్ల‌లోని సొమ్మ‌ను లాగేసుకోవ‌డం ఏమిట‌ని స‌ర్పంచులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇంత‌వ‌ర‌కు సుమారు ర‌.7,600 కోట్లు రాత్రికి రాత్రే తీసుకుంద‌ని, ఈ దొంగచాటు వ్య‌వ‌హారం ఏమిట‌ని నిల‌దీస్తున్నారు. ఇదికాకుండా గ్రామ స‌చివాల‌యాల పేరుతో స‌ర్పంచుల అధికారాల్లో కోత పెట్టింది. అధికారాల‌ను సచివాల‌యాల‌కు, సెక్ర‌టరీల‌కు అప్ప‌జెప్పింది. చిన్న ప‌నులు చేయ‌డానికి కూడా స‌ర్పంచుల‌కు ఎలాంటి ప‌వ‌ర్ లేకుండా పోయింద‌ని వారంతా బాధ‌ప‌డుతున్నారు.
స‌ర్పంచుల‌కే అధికారాలు లేన‌ప్పుడు వార్డు స‌భ్యుల గురించి చెప్పేముంది? వాలంటీర్ల కార‌ణంగా త‌మ‌కు అస‌లు ప్రాధాన్య‌మే ఉండ‌డం లేద‌ని వాపోతున్నారు.