ఉక్రెయిన్ రష్యా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారల విషయంలో అనుసరిస్తున్న తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. విదేశీ వ్యవహారాల విషయాలలో ఇండియా వెనుకబడి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. విదేశీ వ్యవహారాల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం తనకు ఇష్టం లేదని… కానీ కొన్నిసార్లు మనం విదేశీ వ్యవహారాల విషయంలో వెనుకబడి ఉన్నామని తాను చూశాననన్నారు. రాజకీయాల కంటే మానవత్వమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, శాంతి చర్చల్లో ప్రధాన పాత్ర పోషించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను ఎందుకు వెనక్కి తీసుకురావడంలేదని ఆమె ప్రశ్నించారు. భారతీయులను తరలించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మమతా బెనర్జీ అన్నారు.
అనేక మంది భారతీయులను ప్రభుత్వం ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుంచి తరలించగా, కొంతమంది ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయారు. మంగళవారం, కర్నాటకలోని హవేరీ జిల్లాకు చెందిన ఒక వైద్య విద్యార్థి తూర్పు ఉక్రేనియన్ నగరం ఖార్కివ్‌లో షెల్లింగ్‌లో మరణించాడు. యుద్ధం జరిగితే అంతా నాశనమవుతుందని, శాంతి చర్చల్లో భారత్ ముందుండవచ్చని బెంగాల్ ముఖ్యమంత్రి సూచించారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బెనర్జీ ఇటీవల బేషరతు మద్దతును అందించారు. ఈ సమస్యపై ఐక్య వైఖరిని తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ప్రధాని మోడీని కోరారు.