Site icon HashtagU Telugu

Investments: తెలంగాణలో Welspun World గ్రూప్ పెట్టుబడులు

CM Revanth Reddy

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వెల్‌స్పన్ గ్రూప్‌ ఛైర్మన్ శ్రీ బి. కె. గోయెంకా, సంస్థ ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు.

వెల్‌స్పన్ గ్రూప్‌ చైర్మన్ శ్రీ బి. కె. గోయెంకా మాట్లాడుతూ, తమ కంపెనీ భవిష్యత్తులో చందన్‌వెల్లి పారిశ్రామిక వాడలో ప్రారంభించబడిన IT సేవలలో రూ. 250 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో ఐటి రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి  శేషాద్రి, ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, సిఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, వెల్‌స్పన్ గ్రూప్‌ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్ థాకర్, భార్గవ మొవ్వ తదితరులు పాల్గొన్నారు.

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతున్నది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్‌తో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సమావేశంలో చర్చించారు.

పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా ఓ గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్, లిథియం-అయాన్ బ్యాటరీ తయరీ ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపిస్తున్నది. తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్, శంషాబాద్‌లోని ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

Exit mobile version