Another Gold @CWG: కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. మహిళల విభాగంలో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలిస్తే.. తాజాగా పురుషుల విభాగంలో యువ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రీ సంచలనం సృష్టించాడు.

  • Written By:
  • Updated On - August 1, 2022 / 01:56 PM IST

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. మహిళల విభాగంలో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలిస్తే.. తాజాగా పురుషుల విభాగంలో యువ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రీ సంచలనం సృష్టించాడు. 67 కేజీల విభాగంలో సరికొత్త కామన్‌వెల్త్ రికార్డు నెలకొల్పి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 19 ఏళ్ళ జెరెమెకి ఇదే తొలి కామన్‌వెల్త్‌గేమ్స్‌. తొలి ప్రయత్నంలోనే 136 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీల బరువు ఎత్తాడు.

క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తబోయి నొప్పితో బాధపడిన జెరెమీ.. రెండో ప్రయత్నంలో 160 కేజీలను ఎత్తాడు. మూడో ప్రయత్నంలో విఫలమైనా ఓవరాల్‌గా 300 కేజీలతో గోల్డ్ మెడల్‌ సాధించాడు. స్నాచ్‌లో 140 కేజీలు ఎత్తి రికార్డు సృష్టించిన ఇండియన్‌ వెయిట్‌లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రిన్నుంగా క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 154 కేజీలు ఎత్తే ప్రయత్నంలో నొప్పితో విలవిల్లాడాడు. అతడు ఈ బరువు ఎత్తినా.. తర్వాత ఒక్కసారిగా నొప్పితో కిందపడ్డాడు. అతన్ని సపోర్ట్ స్టాఫ్‌ బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

తర్వాత నొప్పితోనే 140 కేజీలు ఎత్తడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ కామన్‌వెల్త్ గేమ్స్‌తోనే అరంగేట్రం చేసిన జెరెమి అంచనాలకు మించి రాణించాడు. దీంతో ఇప్పటి వరకూ భారత్ సాధించిన పతకాల సంఖ్య 5 కు చేరింది. 5 పతకాలూ వెయిట్‌లిఫ్టింగ్‌లోనే వచ్చాయి. మీరాబాయి , జెరెమి స్వర్ణాలు సాధిస్తే… సంకేత్‌ సర్గార్, బింద్యారాణి రజతాలు గెలిచారు. ఇక గురురాజా పుజారి కాంస్యం సాధించాడు.