BC leaders: హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేస్తాం: బీసీ నాయకులు

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 11:58 PM IST

BC leaders: సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల ఓట్లతో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు.

బి.సి ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బి.సి కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కామారెడ్డిలో సమగ్ర కులగణన అంటూ, గవర్నర్ తో బి.సి కులగణన అని అసెంబ్లీలో మాట్లాడించడం ఎలా సరైందని అన్నారు. నొసలుతో ఒకటి, నోటితో మరొకటి మాట్లాడుతున్న రేవంత్ రాజకీయాలను బి.సి లు అర్థం చేసుకోవాలని అన్నారు. సమగ్ర కులజనగణన జరపకుండా ఎన్నికల్లోకి వెళ్లి చట్టపరమైన సమస్యలను సాకు చూపెట్టి బి.సి లకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బి.సి లకు వ్యతిరేకంగానే జరిగిందని, కాకా కలేల్కర్ కమీషన్ నుండి మండల్ కమీషన్ వరకు బి.సి లకు వ్యతిరేకంగా పని చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని ఉన్నారు. బి.సి లకు నష్టం చేసి రేవంత్ రెడ్డి ఏమి సాధిస్తారని, వివిధ కులాలుగా ఆయా వృత్తుల ద్వారా ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న బి.సి లకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, బి.సి శక్తిని రాజకీయ శక్తిగా మార్చి బి.సి వాటా సాధిస్తామని అన్నారు.