జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట జిల్లాను సంపూర్ణ అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ తెలిపారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పైలెట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా ఆరోగ్య బృందం ఇంటింటికి వెళ్లి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసిందని చెప్పారు. అక్టోబర్ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించి.. ప్రణాళికలు రూపొందించామని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు… ప్రత్యేకంగా సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రతిరోజూ వైద్య శిబిరాలు జరుగుతాయని, 594 సచివాలయాలతో పాటు… 13 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా కార్యక్రమ నిర్వహణకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద వ్యూహరచన చేసినట్లు కలెక్టర్ వివరించారు.
కాగా మరోవైపు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 407 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ P.ప్రశాంతి తెలిపారు. నరసాపురంలో జల్ జీవన్ మిషన్ పనులను కలెక్టర్ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరసాపురం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్లు అందించనున్నట్లు చెప్పారు. ఇందులోనే 50 కోట్ల రూపాయల నిధులతో జగనన్న కాలనీలకు కూడా పైప్ లైన్లు వేస్తున్నట్లు చెప్పారు.