Minister Jupalli: సీఎం రేవంత్‌తో చర్చించి మళ్లీ నంది అవార్డులు అందజేస్తాం: మంత్రి జూపల్లి

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 01:20 PM IST

Minister Jupalli: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి మళ్లీ నంది అవార్డులు అందజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఇచ్చే నంది అవార్డుల ప్రక్రియ ఆగిపోవడం బాధాకరమన్నారు. అవార్డులను మళ్లీ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. సినీ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి శత వసంత మహోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నంది అవార్డుల అమలును మళ్లీ ప్రారంభించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకోవాలని కోరారు. గత పదేళ్లుగా నంది అవార్డుల ప్రక్రియ నిలిచిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను సినీ నటులు ఎంతో గౌరవిస్తారని గుర్తు చేశారు. ఎందరో నటీనటుల భవిష్యత్తును కృష్ణవేణి తీర్చిదిద్దారని కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె గొప్ప సేవలందించారని, ఆమెను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు జయసుధ, రోజా రమణి తదితరులు పాల్గొన్నారు.