Osmania University: ఓయూలో నీటికి కటకట.. కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నేత ఫైర్

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 02:39 PM IST

Osmania University: కరెంటు, తాగు నీటి కొరత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత ఉందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వందేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజు వచ్చాయని, కరెంటు కొరత నీళ్ల కొరత ఉందని విద్యార్థులను పంపించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని కేసీఆర్ గారు నిలదీస్తే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఎగిరెగిరి పడుతున్నారని, రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని దబాయిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితులకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఏం సమాధానం చెబుతారని, కాంగ్రెస్ పాలనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసక బారిందని ఎర్రోళ్ల మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..చీకటి రాజ్యమేనా? అన్ని వర్గాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఉస్మానియా విద్యార్థులను కూడా వదలలేదని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులను, ఉస్మానియాలో చదివే విద్యార్థులను వెళ్లగొట్టడం దారుణమైన చర్య అని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.