Site icon HashtagU Telugu

Indian Army: ఆపరేషన్ సిందూర్‌.. మరో వీడియో విడుద‌ల చేసిన ఇండియ‌న్ ఆర్మీ!

Indian Army

Indian Army

Indian Army: భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన మరో వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో షేర్ చేసింది. ఈ వీడియోలో భారత సైనికులు (Indian Army) ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ భారత సైన్యం ఇలా రాసుకొచ్చింది. “ప్రణాళిక వేశాం, శిక్షణ తీసుకున్నాం, చర్య తీసుకున్నాం. న్యాయం జరిగింది.” ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కు ఒక పాఠం అని, దశాబ్దాలుగా అది నేర్చుకోని పాఠం అని సైన్యం పేర్కొంది.

“ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడితో ప్రారంభమైంది. ఇది ప్రతీకార భావన కాదు, ఇది న్యాయం. మే 9 రాత్రి 9 గంటల సమయంలో ఏ శత్రు పోస్టు సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించిందో ఆ పోస్టులన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక చర్య కాదు.. ఇది పాకిస్తాన్‌కు దశాబ్దాలుగా నేర్చుకోని పాఠం” అని రాసుకొచ్చింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత నగరాలపై వరుసగా డ్రోన్లు, మిసైల్స్‌తో దాడులు చేసింది. దీనికి భారత సైన్యం తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి సీజ్‌ఫైర్ విజ్ఞప్తి వచ్చిన తర్వాత మే 10 సాయంత్రం రెండు దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరింది. అయితే అప్పటికే భారత సైన్యం పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించింది. భారత సైన్యం పాకిస్తాన్‌కు చెందిన 11 ఎయిర్‌బేస్‌లను పూర్తిగా ధ్వంసం చేసింది.

వీడియో ఇక్క‌డ‌ చూడ‌వ‌చ్చు..!

ఆపరేషన్ సిందూర్‌ను భారత సైన్యం మే 7, 2025న ప్రారంభించింది. ఈ ఆప‌రేష‌న్‌ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన చర్య. ప‌హ‌ల్గామ్‌ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని లష్కర్-ఎ-తొయిబా (LeT), జైష్-ఎ-మహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

Also Read: High Blood Pressure: హైపర్‌టెన్షన్.. క‌ళ్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తగా నిర్వ‌హించారు. ఈ ఆపరేషన్‌లో లోయిటరింగ్ మ్యూనిషన్స్ (సూసైడ్ డ్రోన్స్), SCALP (స్టార్మ్ షాడో) క్రూయిజ్ మిసైల్స్ వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది.