Site icon HashtagU Telugu

Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్

Russia Vs Wagner Group

రష్యాలో సైనిక తిరుగుబాటు జరుగుతోందా ? 

రష్యా  కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ పుతిన్ పై తిరగబడిందా ? 

రష్యా  కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ (wagner) అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ దేశ అధ్యక్షుడు  పుతిన్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. “మా దళాల మార్గంలో వచ్చే అన్నింటిని నాశనం చేస్తాను” అని  ఆయన చెప్పాడు. “మేము ముందుకు వెళ్తున్నాము.. మేము చివరి దాకా  వెళ్తాము” అని పేర్కొన్నాడు. ఈమేరకు  ఒక కొత్త ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు.  తన బలగాలు ఇప్పటికే  దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌లోకి ప్రవేశించాయని చెప్పాడు.

Also read : Building Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, నష్ట పరిహారం ప్రకటించిన సీఎం

గత కొన్ని నెలలుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు..  యవ్జెనీ ప్రిగోజిన్ కు మధ్య వైరం నడుస్తోంది.  ఈనేపథ్యంలో రష్యా ఆర్మీ తన బలగాలపైకి క్షిపణి దాడులు చేస్తోందని యవ్జెనీ ప్రిగోజిన్ ఆరోపిస్తున్నాడు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని అతడు  ప్రతిజ్ఞ చేశాడు. మాస్కో సైనిక నాయకత్వాన్ని (పుతిన్ ను) శిక్షించేందుకు రష్యన్లు తన దళాలలో చేరాలని కోరాడు. ఈనేపథ్యంలో 62 ఏళ్ల యెవ్జెనీ ప్రిగోజిన్ పై రష్యా అధికారులు నేర దర్యాప్తును ప్రారంభించారు. ప్రిగోజిన్ చేస్తున్న వాదనల గురించి పుతిన్‌కు తెలియజేశామని.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని క్రెమ్లిన్ వెల్లడించింది. “చట్టవిరుద్ధమైన చర్యలను వెంటనే నిలిపివేయాలని వాగ్నెర్ గ్రూప్ ను మేము డిమాండ్ చేస్తున్నాము” అని రష్యా నేషనల్ యాంటీ టెర్రర్ కమిటీ ఆదేశించింది.