Agnipath : వైజాగ్ రైల్వే స్టేషన్ మూసివేత.. బెజ‌వాడ‌, గుంటూరులో హైఅలెర్ట్‌

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 09:34 AM IST

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్‌ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖ రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ ఆశావహులు భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేప‌థ్యంలో అధికారులు స్టేషన్‌ను మూసివేశారు.ఈ రోజు ఉదయం 7 గంటలకు రైళ్లను నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఉదయం 7 గంటల వరకు స్టేషన్‌లోకి అనుమతించారు. తర్వాత స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ నుంచి వచ్చే అన్ని రైళ్లను శివార్లలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఆపడం లేదా దారి మళ్లించడం జరిగింది. హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద ఆపడం లేదా దారి మళ్లించడం జరిగింది.

మరోవైపు గుంటూరు రైల్వే స్టేషన్‌లో సైన్యంలో చేరాలని భావిస్తున్న యువత భారీ నిరసనకు యోచిస్తున్నట్లు సమాచారం అందడంతో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. టిక్కెట్లను తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులను ప్రాంగణంలోకి అనుమతించారు. గుంటూరు స్టేషన్‌ వైపు వెళ్తున్న 20 మంది యువకులను కొత్తపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు స్టేషన్‌లో నిరసన తెలియజేయాలని వాట్సాప్‌లో సందేశాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది, వందలాది మంది యువకులు ఆందోళనకు దిగి.. రైళ్లు, వస్తువులను తగులబెట్టారు. స్టేషన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తొమ్మిది గంటలకు పైగా నిరసన కొనసాగిన అనంతరం పోలీసులు యువకులను అరెస్టు చేశారు. శుక్రవారం అర్థరాత్రి రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.