Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై…

భారత్ క్రికెట్ లో కెప్టెన్ గా కోహ్లీ శకం ముగిసింది. ధోనీ వారసుడిగా పగ్గాలు అందుకున్న కోహ్లీ గత ఏడాది టీ ట్వంటీ కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ సెలక్టర్లు విరాట్ ను తప్పించారు.

  • Written By:
  • Publish Date - January 15, 2022 / 08:05 PM IST

భారత్ క్రికెట్ లో కెప్టెన్ గా కోహ్లీ శకం ముగిసింది. ధోనీ వారసుడిగా పగ్గాలు అందుకున్న కోహ్లీ గత ఏడాది టీ ట్వంటీ కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ సెలక్టర్లు విరాట్ ను తప్పించారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గడ్డ పై సీరీస్ ముగియగానే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడి జట్టును సరైన దిశగా నడిపించానని చెప్పాడు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించాడు.

టీమీండియా సారధిగా ఏడేళ్ల ప్రయాణంలో అలుపెరుగని పోరాటం చేశా.. భారత్ ని గెలిపించడానికి నీతి, నిజాయతీతో పని చేశా. దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు టీమీండియా టెస్ట్ కెప్టెన్సీ ఆ ముగింపు అనుకుంటున్నాను. ఈ ఏడేళ్ల ప్రయాణంలో చాలా ఆటుపోట్లు చూశా. దేశానికి నాయకత్వం వహించే బాధ్యతలు ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలని కోహ్లీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

నిజానికి భారత్ టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. సారథిగా 68 మ్యాచ్ లలో 40 విజయాలు అందించిన కోహ్లీ ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లీ నిర్ణయానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత సఫారీ టూర్ లో టెస్ట్ సీరీస్ గెలవలేక పోవడం కంటే బీసీసీఐతో అతని రిలేషన్ షిప్ సరిగ్గా లేదనేది ప్రధాన కారణం. తాజా సీరీస్ ఓటమితో తనని సారథిగా తప్పించక ముందే వైదొలగడం మంచిదని నిర్ణయించుకునే కోహ్లీ ఈ ప్రకటన చేశాడని భావిస్తున్నారు.

వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించినప్పుడే కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బోర్డు వైఖరి సరిగా లేదని కోహ్లీ విమర్శిస్తే…అదేం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే కోహ్లీకి సారథిగా ఇదే చివరి సీరీస్ గా చాలా మంది ఊహించారు. అందుకు తగ్గట్టుగానే సీరీస్ ఓటమితో కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. ఇదిలా ఉంటే జట్టు సెలక్షన్ కు సంబందించి కూడా కోహ్లీ వైఖరి పై బీసీసీఐ కాస్త అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను కోహ్లీ పదే పదే వెనుకేసుకురావడంపై కూడా కోచ్ ద్రవిడ్‌తో సహా బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం మీద బీసీసీఐ తో సంబంధాలు చెడిపోవడం , ఆ తర్వాత సీరీస్ ఓటమి…కోహ్లీ కెప్టెన్సీ కు ఎండ్ కార్డ్ వేసాయని చెప్పొచ్చు.