Site icon HashtagU Telugu

T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్

virat kohli

virat kohli

వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా విరామం లేని షెడ్యూల్ తో బిజీగా గడుపుతుండడంతో రెస్ట్ తీసుకునేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. పీటీఐ వార్తాకథనం ప్రకారం శనివారం ఉదయమే కోహ్లీతో పాటు పంత్ బబూల్ ను వీడి ఇంటికెళ్ళారు. కోహ్లీ 10 రోజుల విశ్రాంతి కోసం ముందే బోర్డుకు రిక్వెస్ట్ చేసుకోగా… బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో శ్రీలంకతో జరిగే టీ ట్వంటీ సిరీస్ కు కూడా కోహ్లీ దూరం కానున్నాడు. అయితే లంకతో టెస్ట్ సిరీస్ కోసం కోహ్లీ మళ్ళీ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అటు రిషబ్ పంత్ కూడా బబూల్ నుండి బ్రేక్ కోరుకోవడంతో బోర్డు అనుమతి ఇచ్చింది.

విండీస్ పై రెండో టీ20లో విరాట్‌ కోహ్లి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 52 పరుగులు సాధించాడు. అటు రిష‌బ్ పంత్ కూడా త‌న దూకుడైన బ్యాటింగ్ తో అల‌రించాడు. కేవ‌లం 28 బంతుల్లో అత‌ను 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆఫ్ సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్న పంత్‌.. ఎందుకు విరామం తీసుకున్నాడో స్ప‌ష్టంగా తెలియ‌దు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలిచిన రోహిత్ సేన సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మరోవైపు ఈనెల 24 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ లక్నోలో జరగనుండగా.. ఆ తర్వాత రెండు మ్యాచులు ధర్మశాలలో జరగనున్నాయి. అటు మార్చి 4నుంచి 8 వరకు మొహలీలో తొలి టెస్టు, మార్చి 12నుంచి 16 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరగనుంది.