IND vs SL: ద్రావిడ్ చేతుల మీదుగా స్పెషల్ క్యాప్.. కోహ్లీ భావోద్వేగం

  • Written By:
  • Publish Date - March 4, 2022 / 10:37 AM IST

టెస్ట్ క్రికెట్ లో వంద మ్యాచ్ లు ఆడడం సాధారణ విషయం కాదు…ఆ మాటకు వస్తే టీ ట్వంటీ ఫార్మాట్ క్రేజ్ పెరిగిపోతున్న వేళ సంప్రదాయ క్రికెట్ లో నిలకడగా కొనసాగడం అంత సులువు కాదు.నిజానికి ఈ ఆటగాడు ప్రతిభకు టెస్ట్ క్రికెట్ నే కొలమానంగా చెప్తారు. అందుకే ఈ ఫార్మాట్ లో రాణిస్తే ఆ ప్లేయర్ కు తిరుగు లేనట్టే. భారత్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్టుల్లో వంద మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాడు. లంకతో మొహాలీ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు తో కోహ్లీ ఈ మైలురాయి అందుకున్నాడు. ప్రత్యేకమయిన మ్యాచ్ కావడంతో బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వందో టెస్ట్ సందర్భంగా ఆట ఆరంభానికి ముందు కోహ్లీ నీ సత్కరించింది. కోచ్ రాహుల్ ద్రావిడ్ చేతుల మీదుగా ప్రత్యేకంగా రూపొందించిన క్యాప్ ను అందించింది. ఈ సందర్భంగా కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

కోహ్లీ సతీమణి అనుష్క శర్మను కూడా మైదానంలోకి ఆహ్వానించి , జట్టు సహచరులు ముందు ద్రావిడ్ ఈ జ్ఞాపికను అందజేశారు.ఇది తనకు చాలా ప్రత్యేకమైన క్షణమనీ, తన భార్య , సోదరుడు కూడా ఇక్కడే ఉన్నారనీ, అందరూ చాలా గర్వంగా ఉన్నారన్నాడు . బీసీసీఐకి కూడా ధన్యవాదాలన్న కోహ్లీ అభిమానుల రాకతో ఈ మ్యాచ్ మరింత ప్రత్యేకంగా నిలిచిందనీ ఎమోషనల్ అయ్యాడు. కాగా 90 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం 11 మంది క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు. ఇప్పుడు కోహ్లీ 12వ భారత ఆటగాడిగా వంద టెస్టుల క్లబ్ లో చేరాడు. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 50 శాతం మంది అభిమానులను అనుమతించడం తో చాలా రోజుల తర్వాత మొహాలీ క్రికెట్ స్టేడియం కోహ్లీ కోహ్లీ అంటూ ఫాన్స్ నినాదాలతో హోరెత్తిపోయింది.