టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం, ఏపీలో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై చర్చించేందుకు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డగిని, సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్‌ఎస్ రాజమౌళి, నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు కలిసిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియా సాక్షిగా మాట్లాడుతూ, సినీ సమస్యల పై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెల్పుతూ, వారం పది రోజుల్లో శుభవార్త వింటారని తెలిపారు.
అయితే తాజాగా ఈ భేటీ పై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఎల్లో మీడియా అండ్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సీఎం జగన్‌ని కలవడంతో టీడీపీ నేతలకు మింగుడు పడడంలేదని, ఈ భేటీ పచ్చ పార్టీలో పెద్ద పెద్ద కలకలమే లేపిందన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అండ్ లోకేష్ ఇద్దరూ భోజనం కూడా చేయడం లేదని సెటైర్ వేశారు. అంతే కాకుండా యజమానుల బాధ చూసి, టీడీపీ తమ్ముళ్ళు పొర్లిపొర్లి శోకాలు పెట్టి ఉంటారని, సినిమావాళ్లు చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తనాదాలు అవసరమా విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
