Vice-President Dhankhar: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ (Vice-President Dhankhar) మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా బుధవారం నైనిటాల్‌లోని కుమావున్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన సందర్భంలో అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగం ముగించిన అనంతరం వేదిక నుండి దిగి, తన పాత సహచరుడు, మాజీ ఎంపీ మహేంద్ర సింగ్ పాల్‌ను చూసి భావోద్వేగానికి లోనైన ధనకర్, ఆయనను కౌగిలించుకునే సమయంలో స్పృహ కోల్పోయారు.
వెంటనే అప్రమత్తమైన ఉపరాష్ట్రపతి వైద్య సిబ్బంది తక్షణ చికిత్స అందించడంతో ధనకర్ స్పృహలోకి వచ్చారు. ఆయనను నైనిటాల్‌లోని రాజ్ భవన్‌కు తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉపరాష్ట్రపతి ధనకర్ జూన్ 25 నుండి 27 వరకు నైనిటాల్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. హల్ద్వానీలోని ఆర్మీ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనను ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్), రాష్ట్ర మంత్రి రేఖా ఆర్య, ఎంపీ అజయ్ భట్ స్వాగతించారు. కుమావున్ విశ్వవిద్యాలయం వేడుకల్లో 45 నిమిషాల ప్రసంగం చేసిన ధనకర్, 1989లో లోక్‌సభలో తన సహచరుడైన మహేంద్ర సింగ్ పాల్‌తో తిరిగి కలుసుకున్న సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో ఆయనకు అస్వస్థతకు లోనైనట్లు మాజీ ఎంపీ పాల్ తెలిపారు.
Also Read: Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
ప్రభుత్వ, వైద్య స్పందన
ఘటన జరిగిన వెంటనే జిల్లా ఆసుపత్రి వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తక్షణ సహాయం అందించారు. ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. ఉపరాష్ట్రపతి ఆరోగ్యం స్థిరంగా ఉందని, పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటన కారణంగా కార్యక్రమంలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, వైద్య బృందం వేగవంతమైన స్పందనతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది.
మిగిలిన షెడ్యూల్
ఉపరాష్ట్రపతి ధనకర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 27న నైనిటాల్‌లోని షేర్‌వుడ్ కాలేజ్ 156వ స్థాపన దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు. ఆయన ఆరోగ్యం ఆధారంగా మిగిలిన కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.