Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల కన్ను మూత

  • Written By:
  • Updated On - December 23, 2022 / 10:58 AM IST

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. ఫిల్మ్‌నగర్‌లోని (Film Nagar) తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల సత్యనారాయణ దాదాపు 770కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు.

కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. 87ఏళ్ల సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జీవితాన్ని అనుభవించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. 1959లో సిపాయి కూతురు మూవీతో వెండి తెరపై అడుగుపెట్టారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా చాలా పాత్రలో నటించాడు. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరుగాంచారు. 1960 ఏప్రిల్ 10న ఆయనకు నాగేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1935న సత్యనారాయణ (Kaikala Satyanarayana) జన్మించారు. గుడివాడ కాలేజీలో ఆయన గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్‌ నారాయణ గుర్తించి ‘సిపాయి కూతురు’ లో అవకాశం ఇచ్చారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్‌.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్‌గా ఆయన కనిపించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి పాత్రల్లో ఆయన మెప్పించారు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీ కృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘వరకట్నం’, ‘పాపం పసివాడు’, ‘మానవుడు దానవుడు’, ‘యమగోల’, ‘సోగ్గాడు’, ‘సీతా స్వయంవరం’, ‘అడివి రాముడు’, ‘దాన వీర శూర కర్ణ’, ‘కురుక్షేత్రం’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘అగ్నిపర్వతం’, ‘విజేత’, ‘కొండవీటి దొంగ’, ‘కొదమసింహాం’, ‘యమలీల’, ‘అరుంధతి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘మహర్షి’ తర్వాత ఆయన స్క్రీన్‌పై కనిపించలేదు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. లోక్‌సభ ఎంపీగానూ సేవలు అందించారు కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read:  Heart Health Tips : గుండె జబ్బులు దూరం కావాలంటే మాంసానికి బదులుగా ఇవి తినాలి..