Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే

ఐపీఎల్ 15వ సీజన్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 4, 2022 / 11:57 AM IST

ఐపీఎల్ 15వ సీజన్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగే టీ ట్వంటీ సిరీస్‌లో పలువురు యువక్రికెటర్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ కోసం పుజారా, విహారీ వంటి ఆటగాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో టెస్ట్ స్పెష‌లిస్ట్ గా ఉన్న పుజారా, విహారి ఎలా ఆడుతార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌ట్టులో స్థానం కోసం వీరి మ‌ధ్య గట్టి పోటీ ఏర్పడిన నేప‌థ్యంలో విహారి కెరీర్‌పై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశాడు. 50 , 60 స్కోర్లు కాకుండా సెంచ‌రీలు సాధించిన‌ప్పుడే విహారి టీమిండియాలో సుదీర్ఘకాలం కొన‌సాగ‌ుతాడ‌ని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడున్న పోటీప‌రిస్థితుల్లో త‌క్కువ స్కోర్లు చేస్తే జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డం కష్టమేనన్నాడు. ఎక్కువ‌ స‌మ‌యం పాటు క్రీజులో నిల‌దొక్కుకుంటూ భారీ స్కోర్లు సాధించేలా విహారి త‌న కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాల‌ని అజారుద్దీన్ సూచించాడు.

గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటిన విహారీ ప్రస్తుతం టెస్ట్ జట్టుకు ఎంపికవుతున్నా… పోటీ కారణంగా తుదిజట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. అయితే సౌతాఫ్రికా పర్యటనలో పేల‌వ‌ఫామ్ కార‌ణంగా పుజారా చోటు కోల్పోయాడు. అత‌డి స్థానంలో శ్రీలంక సిరీస్ కోసం హ‌నుమ విహారిని ఎంపిక‌చేశారు. ఫామ్ అందుకుంటేనే మళ్ళీ జట్టులోకి తీసుకుంటామని సెలక్టర్లు పుజారాకు చెప్పడంతో కౌంటీల్లో పుజారా వ‌రుస సెంచ‌రీల‌తో చెల‌రేగ‌ాడు.దీంతో ఇంగ్లాండ్‌తో జ‌రుగ‌నున్న టెస్ట్ కోసం మళ్ళీ పుజారాను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో విహారీకి ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టులో చోటు దక్కడంపై సందిగ్ధత నెలకొంది. పుజారా కౌంటీల్లో ఫామ్‌లోకి రావడం, అక్కడి పిచ్‌లపై పూర్తిగా పట్టు సాధించడంతో విహారి రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటకీ.. విహారీ తన ఫామ్‌ను నిలకడగా అది కూడా భారీస్కోర్లు సాధిస్తేనే జట్టులో కొనసాగుతాడని అజారుద్దీన్ చెబుతున్న మాట. ఇప్పటి వరకూ 15 టెస్ట్‌లు ఆడిన విహారి 808 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, ఐదు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ త‌ల‌ప‌డేందుకు ఈ నెల మూడో వారంలో టీమిండియా లండ‌న్ బయలుదేరనుంది.. బ‌ర్మింగ్‌హ‌మ్ వేదిక‌గా జూలై 1 నుంచి 5 వ‌ర‌కు ఈ టెస్ట్ జరగనుండగా… ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.