BJP: ఇవాళ ప్రకటించిన బీజేపీ చివరి జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం పలువురి అభ్యర్థులకు షాక్ ఇచ్చినట్టయింది. ముందస్తుగా ప్రచారం చేసుకోవాలని సంకేతాలు ఇచ్చి, ఆ తర్వాత టికెట్ కేటాయించకపోవడంతో ఆశవాహులు బోరున విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చివరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ మార్చడంతో తుల ఉమ కంటతడి పెట్టారు.
బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో కచ్చితంగా ఉంటానని.. భాజపా బీసీ, మహిళా నినాదమంతా బోగస్ అని విమర్శించారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. తొలుత వేములవాడ భాజపా అభ్యర్థిగా తుల ఉమ ఉండగా చివరి నిమిషంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావును ప్రకటించారు. ప్రస్తుతం తుల ఉమ కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.