White House: ఉక్రెయిన్ దళాలు క్లస్టర్ ఆయుధాలు వాడుతున్నారు: శ్వేతసౌధం

రష్యా దళాలపై ఉక్రెయిన్‌ సేనలు తాము సరఫరా చేసిన క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు తాజాగా అమెరికాలోని శ్వేత సౌధం ధ్రువీకరించింది. ఈ సందర్బంగ

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 03:26 PM IST

రష్యా దళాలపై ఉక్రెయిన్‌ సేనలు తాము సరఫరా చేసిన క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు తాజాగా అమెరికాలోని శ్వేత సౌధం ధ్రువీకరించింది. ఈ సందర్బంగా నేషనల్‌ సెక్యూరిటీ ప్రతినిధి జాన్‌ కిర్బి మాట్లాడుతూ.. రష్యా సైన్యం స్థావరాలు, ఆపరేషన్ లపై ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ కు చెందిన ఒడెస్సా పోర్టు తదితర కీలక ప్రాంతాలపై రష్యా ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేస్తోంది. ఆ దాడిలో దాదాపుగా 19 మంది గాయపడ్డారు. ఫలితంగా ఉక్రెయిన్‌ దళాలు, రష్యాపై క్లస్టర్‌ ఆయుధాల వినియోగం ప్రారంభించాయి.

జులై 8వ తేదీన క్లస్టర్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వారం తర్వాత వాటిని కీవ్‌కు చేర్చింది. అమెరికా పంపిన వాటిల్లో ఎం864, ఎం483ఎ1 క్లస్టర్‌ ఆయుధాలు ఉన్నాయి. వీటిల్లో డడ్‌రేటు 2.35శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఈ రకం ఆయుధ సరఫరాతో ఉక్రెయిన్‌కు మందుగుండు కొరత కూడా తీరుతుంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలు సంప్రదాయ ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ కొరత తీర్చేందుకు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

తాజాగా తాము ఇచ్చిన క్లస్టర్‌ ఆయుధాలను ప్రజలు నివసించే ప్రాంతాల్లో వాడము అని ఉక్రెయిన్‌ వద్ద మాటతీసుకొన్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ పేర్కొన్నారు. మరొకవైపు క్లస్టర్‌ ఆయుధ సరఫరాపై గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందిస్తూ.. తమ వద్ద కూడా తగినన్ని క్లస్టర్‌ ఆయుధాలు ఉన్నాయి అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ ఉక్రెయిన్‌ మళ్ళీ మళ్ళీ అటువంటి ఆయుధాలు వాడితే తాము కూడా అవే వాయుధాలను ఉపయోగిస్తామని తేల్చిచెప్పారు. కాగా మార్చిలో ఐరాస వెలువరించిన ఒక నివేదికలో ఇప్పటికే రష్యా 24 సార్లు క్లస్టర్‌ ఆయుధాలు వాడినట్లు ఒక నివేదికలో వెళ్ళడయింది.

ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం పైనే కనీసం 11 క్లస్టర్‌ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిపింది. క్రిమియా, రష్యాను కలిపే కెర్చ్‌ వంతెనపై దాడి అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. నాలుగు రోజుల్లో 70 క్షిపణులు, 90 షహీద్‌ డ్రోన్ లను ప్రయోగించి ఉక్రెయిన్‌ ఓడరేవు నగరమైన ఒడెస్సాలో విధ్వంసం సృష్టించింది. మరో వైపు రష్యా ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వరకు తమ సైన్యం కూల్చేసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కాకపోతే మొత్తం ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి తమ శక్తి సరిపోదని ఆయన పేర్కొన్నారు. తమ భాగస్వాముల నుంచి అదనపు రక్షణ పరికరాలు పొందడంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు.