Site icon HashtagU Telugu

Ukraine: అమెరికా నుంచి ఉక్రెయిన్ కు అతి చిన్న డ్రోన్ లు.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Ukraine

Ukraine

గత కొద్ది నెలలుగా రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య పరస్పర యుద్ధాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక దేశం పై మరొక దేశం ప్రతిదాడులు జరుపుతూనే ఉంది. కాగా ఇందులో భాగంగా ఇప్పటికే ఒక చాలా నష్టపోయింది. ప్రాణం నష్టం ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. అయినప్పటికీ ఈ దేశాల మధ్య పరస్పర యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అమెరికా, రష్యాపై ఎదురుదాడి చేయడం కోసం మరిన్ని అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుక సిద్ధమైంది. ఈ మేరకు దాదాపు 400 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీని మంగళవారం వాషింగ్టన్‌ ప్రకటించింది.

ఇందులో తొలిసారి బ్లాక్‌ హార్నెట్‌ నిఘా డ్రోన్ లను కూడా ఉక్రెయిన్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రోన్ లను టెలిడిన్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ తయారు చేస్తోంది. నార్వేలో తయారు చేసిన హార్నెట్‌ డ్రోన్ లను ఇప్పటికే ఉక్రెయిన్‌ ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్ లను గతంలో బ్రిటన్‌, నార్వే విరాళంగా అందించాయి. తాజాగా అమెరికా ఈ డ్రోన్ లను ఉక్రెయిన్ కి భారీగా సమకూరుస్తోంది. ఇందుకోసం ఏప్రిల్‌లోనే నార్వేకు చెందిన ఎఫ్‌ఎల్‌ఐఆర్‌ అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌కు 93 మిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టును అమెరికా ఆర్మీ అప్పగించింది. అయితే గతేడాది యుద్ధం మొదట్లో కూడా 850 మైక్రో డ్రోన్ లను బ్రిటన్‌, నార్వే అందించాయి.

నిఘా కోసం నార్వే వీటిని అభివృద్ధి చేసింది. నడముకు కట్టుకునే సంచిలో జాయ్‌స్టిక్‌ వంటి కంట్రోలర్‌, మరో సంచిలో రెండు డ్రోన్ లు ఉంటాయి. ఈ డ్రోన్ లు 25 నిమిషాల పాటు ప్రయాణించగలవు. ఈ మొత్తం సిస్టమ్‌ కేవలం 1.3 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఒక్క డ్రోన్‌ బరువు కేవలం 33 గ్రాములే. దీంతో సైనికులు వీటిని తేలిగ్గా తమ వెంట తీసుకెళ్లవచ్చు. వీటిని వాహనాలపై నుంచి కూడా ప్రయోగించవచ్చు. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకొని ఇవి పనిచేయగలవు. అలాగే ఎటువంటి శబ్దం లేకుండా శత్రు స్థావరాల్లోకి నిశ్శబ్దంగా ఇవి ప్రవేశించగలవు. తక్కువ రిజల్యూషన్‌ ఉన్న చిత్రాలను, వీడియోలను ఇవి రెండు కిలోమీటర్ల దూరంలోని కంట్రోల్‌ స్టేషన్‌కు పంపించగలవు. వీటి ద్వారా జూమ్‌ చేసి శత్రువులను చూడవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రష్యన్ల కదలికలను ముందే గమనించి దాడి చేయడానికి ఉక్రెయిన్‌ సైనికులకు ఇవి ఉపయోగపడ్డాయి. రాత్రి వేళ్లలో కూడా వీటికి ప్రత్యేక పరికరాలు అమర్చి చిత్రాలను తీయవచ్చు. కొత్తగా వచ్చిన బ్లాక్‌ హార్నెట్‌లలో డిజిటల్‌ స్టోరేజీ కూడా ఉంటోంది. దీంతో ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని సురక్షితంగా స్థావరాలకు తీసుకొని రావచ్చు. 2013లోనే ఒక్కో డ్రోన్‌ యూనిట్‌ ఖరీదు 94,000 డాలర్లు.