అమెరికా ఒకప్పుడు ఎంతో రహస్యంగా నిల్వ చేసిన రసాయన ఆయుధాల చివరి విడత నిల్వల ధ్వంసం మొదలైంది. ఈ రహస్య రసాయన ఆయుధాల ధ్వంసం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాగా కొలరాడోలో ఆ దేశ సైన్యానికి చెందిన రసాయన డిపోల్లో వీటిని ధ్వంసం చేసే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టింది. ఇందుకోసం మనుషులను కాకుండా ప్రత్యేకంగా రోబోలను కూడా తెప్పించారు. ఈ డిపోలో అత్యంత ప్రమాదకరమైన మస్టర్డ్ ఏజెంట్స్ తో చేసిన శతఘ్ని తూటాలు కూడా ఉన్నాయి.
వీటిని రోబోలు జాగ్రత్తగా విడదీసి, కడిగి, దాదపు 1,500 ఫారెన్ హీట్ ఉష్ణానికి గురి చేస్తున్నాయి. దీంతో ఆ తూటాలు తుక్కువలే మారపోతాయని ఆర్మ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన డిప్యూటి అసిస్టెంట్ డిఫెన్స్ సెక్రటరీ కింగ్‌స్టన్ రీఫ్ వెల్లడించారు. ఎప్పటినుంచో అమెరికాలో ఉన్న నిల్వలు మొత్తాన్ని నాశనం చేయడం కోసం దాదాపు కొన్ని దశాబ్దాలు పట్టిందని తెలిపారు. ఇప్పుడు ఆ పని చివరి దశకు చేరినట్లు వెల్లడించింది. ప్యూబ్ లో సమీపంలోని డిపోలో చివరి ఆయుధాన్ని జూన్‌లో ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇక కెంటకీలోని మరో డిపోలో మిగిలిన రసాయన ఆయుధాల విధ్వంసం కూడా త్వరలోనే మొదలవుతుందని వెల్లడించింది.
ఈ ప్రక్రియ పూర్తయితే ప్రపంచంలో అధికారికంగా ప్రకటించిన రసాయన ఆయుధాలు మొత్తం కనుమరుగైనట్లవుతాయి. కాగా అమెరికా కొన్ని తరాలుగా ఈ రసాయన ఆయుధాల నిల్వలను పోగేసింది. తొలి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ ఆయుధాల విధ్వంసం తెలిసొచ్చింది. కానీ, అమెరికా సహా పలు దేశాలు మాత్రం వాటిని భారీ స్థాయిలో అభివృద్ధి చేశాయి. అమెరికా వద్ద బయోలాజికల్ ఆయుధాలు కూడా ఒకప్పుడు భారీగా ఉండేవి. కానీ, 1970ల్లో వాటిని ధ్వంసం చేసింది. ఇక 1989లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేయాలని సోవియట్, అమెరికా నిర్ణయించాయి. ఇక బ్రిటన్ 2007లో, భారత్ 2009లో, రష్యా 2017లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాయి.