Lakhimpur-Kheri: ఘటనపై సిట్ నివేదిక

  • Written By:
  • Publish Date - January 3, 2022 / 02:50 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటనలో సిట్‌ 5000 పేజీల ఛార్జ్‌షీట్‌ను సోమవారం లఖింపుర్‌ ఖేరీలోని చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు.

ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. లఖింపుర్‌ ఉద్రిక్తతలు జరిగిన సమయంలో ఆశిష్‌ మిశ్ర ఘటనాస్థలంలోనే ఉన్నారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులపై ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు రైతులు మృతి చెందగా, అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆశిష్‌ మిశ్రా ఉద్దేశపూర్వకంగానే రైతులను కారుతో తొక్కించాడంటూ స్థానికులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారం తర్వాత ఆశిష్‌ సహా 13 మందిని అరెస్టు చేశారు. అయితే కేసు విచారణలో జాప్యంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయాగా.. సుప్రీం కోర్టు జోక్యంతో యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిట్‌.. ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పష్టం చేసింది.

మరోవైపు తన కుమారుడిపై వస్తోన్న ఆరోపణలను కేంద్రమంత్రి అజయ్‌ మిశ్ర కొట్టిపారేస్తున్నారు. కుట్రపూరితంగానే తన కుమారుడిని ఈ కేసులో ఇరికించారని, అసలు ఘటన జరిగిన సమయంలో ఆశిష్‌ ఆ కారులో లేడని అన్నారు.