ఓ పోలీస్ అధికారి (Police officer) తన భార్య, పిల్లలు చేసిన పనికి చిక్కుల్లో పడ్డాడు. ఉన్నతాధికారులు సదరు అధికారిపై బదిలీ వేటు వేయడంతో పాటు విచారణసైతం ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ఉన్నావ్ (Unnao) లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్‌లోని బెహ్తా ముజవార్ పోలీస్ స్టేషన్‌లో రమేష్ చంద్ర సుహానీ (Ramesh Chandra Sahani) స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యుల ఫొటో సోషల్ మీడియా (social media) లో వైరల్ అయింది. రూ.500 నోట్ల కట్టలతో వారు సెల్పీదిగారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకాస్త వైరల్ కావడంతో పోలీసు అధికారికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉన్నతాధికారులు రమేష్ చంద్ర సువానీని తక్షణమే బదిలీ చేశారు. అతనిపై విచారణ సైతం ప్రారంభించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో రమేష్ చంద్ర సుహానీ భార్య, ఇద్దరు పిల్లలు బెడ్‌పై కూర్చొని దాదాపు 300 వరకు రూ. 500 నోట్ల కట్టలను పరిచి సెల్పీలు, ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అయితే, రమేష్ చంద్ర సుహానీ మాత్రం ఆ డబ్బును తన సొంత డబ్బు అని ఉన్నతాధికారులకు వివరించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో ఉన్న ఫొటో 2021లో నవంబర్ 14న తన సొంత కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసినదని చెప్పాడు.
ఆ ఫొటోల్లో కనిపిస్తున్న నగదు విలువను పోలీసు అధికారులు వెల్లడించలేదు. కానీ వాటి విలువ రూ. 14లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనపై సీనియర్ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో నగదు ఎప్పటిది? ఎలా వచ్చింది? రమేష్ చంద్ర సుహానీ చెబుతున్నట్లు అతని సొంత భూమిని అమ్మితే వచ్చిన డబ్బేనా? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణ నివేదిక వచ్చిన తరువాత రమేష్ చంద్ర సుహానీ తప్పు చేశాడని ఆధారాలు వెల్లడైతే చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు.